KGF Chapter2: ‘కేజీయఫ్‌2’ తెలుగు ట్రైలర్‌ విడుదల చేసేది ఎవరో తెలుసా?

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్‌2’ ఒకటి. కన్నడ చిత్రంగా మొదలై పాన్‌ ఇండియా

Published : 27 Mar 2022 12:10 IST

హైదరాబాద్‌: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్‌2’ ఒకటి. కన్నడ చిత్రంగా మొదలై పాన్‌ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వసూళ్లు సాధించింది ‘కేజీయఫ్‌: చాప్టర్‌-1’. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే ‘కేజీయఫ్‌2’. కాగా, ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. ‘కేజీయఫ్‌2’ తెలుగు ట్రైలర్‌ను స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఆదివారం పుట్టిన రోజు జరుపుకొంటున్న చరణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం సంతోషంగా ఉందని పేర్కొంది. సాయంత్రం 6.40గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక తమిళ ట్రైలర్‌ను నటుడు సూర్య విడుదల చేస్తారు. 2021 జనవరి 7న యశ్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేసిన తర్వాత కేజీయఫ్‌2 నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఇప్పుడు ఏకంగా ట్రైలర్‌ విడుదల చేస్తుండటంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని