Rashmika: అలా చేయడం నేరం..: రష్మిక

డీప్‌ ఫేక్‌ వీడియో ఘటనలో నిందితుడి అరెస్టుపై నటి రష్మిక (Rashmika) స్పందించారు. పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు.

Updated : 21 Jan 2024 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డీప్‌ ఫేక్‌ వీడియో ఘటనలో నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటి రష్మిక (Rashmika) హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. మార్ఫింగ్‌ వీడియోలు, ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు. ‘‘దిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. ప్రేమతో నన్ను ఆదరించి.. అన్నివిధాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యువతకు చెప్పేదొక్కటే.. అనుమతి తీసుకోకుండా మీ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరం’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.

సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి అసభ్యకర వీడియో సృష్టించిన విషయం తెలిసిందే. అది నెట్టింట వైరల్‌గా మారడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందారు. దిల్లీ మహిళా కమిషన్‌ నుంచి పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24)ను అరెస్టు చేశారు. అతడే ఈ వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయని దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్‌ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే ఈ వీడియో తయారు చేసినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు