TFCC: సంక్రాంతి సినిమాలు.. అలా రాస్తే చర్యలు తప్పవు: టీఎఫ్‌సీసీ

సంక్రాంతి సినిమాల గురించి వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తే సహించేది లేదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పలు వెబ్‌సైట్లను హెచ్చరించాయి.

Published : 09 Jan 2024 19:54 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్న, అదే సమయంలో విడుదలకావాల్సి ఉండి వాయిదా పడిన సినిమాలపై ఇష్టం వచ్చినట్లు రాస్తే చర్యలు తప్పవని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌.. పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లను హెచ్చరించాయి. ఈ మేరకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పరిశ్రమ బాగుండాలనేదే ఈ మూడు సంస్థల ప్రయత్నమని కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, కె. అనుపమ్‌ రెడ్డి, తుమ్మల ప్రసన్న కుమార్‌ తెలిపారు.

ప్రతి సంక్రాంతికి నాపై విమర్శలే: దిల్‌ రాజు

‘‘ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్న తెలుగు సినిమాల నిర్మాతలతో 15 రోజుల క్రితం మేం సమావేశమయ్యాం. గ్రౌండ్‌ రియాలిటీ గురించి వివరించి సహకరించమని కోరాం. ఛాంబర్‌ విజ్ఞప్తి మేరకు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, హీరో రవితేజ ‘ఈగల్‌’ సినిమా వాయిదాకు అంగీకరించారు. ఫిబ్రవరి 9న ఆ చిత్రం విడుదలవుతుంది. విశేష అభిమానగణం ఉన్న  నటుడు సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుని వెనక్కి తగ్గడమంటే మామూలు విషయం కాదు. మరోవైపు, తమిళ హీరోలు, నిర్మాతలు సహకరించారు. ఈ మేరకు.. రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’, ధనుష్ ‘కెప్టెన్‌ మిల్లర్‌’, శివ కార్తికేయన్ ‘అయలాన్‌’ వాయిదా పడ్డాయి. ఏ సంక్రాంతికైనా పలు సినిమాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉంటుంది. తెలుగు చిత్రాలకు సంబంధించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా మేం నిర్ణయాలు తీసుకుంటున్నాం. వ్యూస్‌ కోసం పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు సంక్రాంతి సినిమాల గురించి తమకు తోచింది రాస్తూ అభిమానులు మధ్య, హీరోల మధ్య, దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టికల్స్ రాసే ముందు మా మూడు ఆర్గనైజేషన్స్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా వార్తలు రాయడం సరైంది కాదు. ఇకపై అలాంటి వార్తలు కనిపిస్తే సంబంధిత వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లపై చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ (జనవరి 12) (Guntur Kaaram), తేజ సజ్జ ‘హను-మాన్‌’(జనవరి 12) (Hanu Man), వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ (జనవరి 13) (Saindhav), నాగార్జున ‘నా సామిరంగ’ (జనవరి 14) (Naa Saamiranga) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 13న విడుదలకావాల్సిన ‘ఈగల్‌’ ఆలస్యంగా రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని