MAA Elections: మెగా ఫ్యామిలీ ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉంటే.. విష్ణుకి నో చెప్పేవాడిని  

చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉండుంటే తాను మంచు విష్ణుని ఎన్నికల నుంచి విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడినని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో..

Updated : 04 Oct 2021 08:45 IST

మోహన్‌బాబు కీలకవ్యాఖ్యలు

హైదరాబాద్‌: చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉండుంటే తాను మంచు విష్ణుని ఎన్నికల నుంచి విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడినని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలపై స్పందించారు. ముఖ్యంగా ‘మా’ ఎన్నికలపై మాట్లాడారు. తాజా ఎన్నికల్లో విష్ణు విజయం తథ్యమని.. ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం ‘మా’ భవనం కట్టించి తీరతాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశ్‌రాజ్‌తో తనకేమీ గొడవలు లేవని.. తాను ఎక్కడైనా కనిపిస్తే.. అన్నయ్యా బాగున్నారా అని బాగానే మాట్లాతాడని మోహన్‌బాబు తెలిపారు. అలాగే ‘మా’ ఎన్నికల్లో జయసుధ మద్దతు తమకే ఉంటుందని భావించామని.. అందరూ అదే అనుకున్నారని.. కానీ ఆమె అవతలి ప్యానల్‌కు మద్దతు ఇచ్చారని.. అది ఆమె వ్యక్తిగత విషయమని ఆయన వివరించారు.

‘‘మెగా ఫ్యామిలీ వారసులు, అల్లు అరవింద్‌ కుమారులెవరైనా సరే ‘మా’ ఎన్నికల బరిలో ఉండుంటే మంచు విష్ణుని పోటీలో నిలబెట్టేవాడిని కాదు. ఎందుకంటే వాళ్లూ నాకు బిడ్డలాంటివారే. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. చిరంజీవి ఇప్పటికీ ఎప్పటికీ నా స్నేహితుడే. ‘మా’ ఎన్నికల కారణంగా మా మధ్య ఎలాంటి దూరం పెరగలేదు. ఈ ఎన్నికల్లో మద్దతు కోరుతూ దాదాపు 800 మంది ఆర్టిస్టులతో ఫోన్‌లో మాట్లాడా. మంచు విష్ణు కూడా సుమారు 600 మందితో మాట్లాడాడు. కొంతమందిని కలిశాడు. వాళ్ల మద్దతు మాకే ఉంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు. గురువుగారు దాసరి నారాయణరావుతోనే ఆ పెద్దరికం పోయింది. ఇప్పుడు ఎవరైనా తాము సినీ పెద్దలుగా భావిస్తున్నారేమో నాకు తెలీదు. దాని గురించి నేను మాట్లాడను. గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించాను. నాకు నప్పే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ని రజనీకాంత్‌తో వెళ్లి కలిశాను. ఆయన నన్ను చూడగానే.. ‘ఇతను మంచి వ్యక్తి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు’ అని చెప్పేశారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విని నా కన్నీళ్లు ఆగలేదు’’ అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని