RGV: వాళ్లెలా రాక్షసులుగా మారిపోయారు?

‘‘మంచి.. చేడు.. అనేవి నేను చూడను. ప్రతి మనిషి అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఓ నిర్ణయం తీసుకుంటాడు. దాని వల్ల మంచి జరిగితే అతన్ని మంచోడంటారు. చెడు జరిగితే చెడ్డొడంటారు. అయితే ఆయా వ్యక్తుల జీవితాల్లో

Updated : 30 Dec 2021 07:22 IST

‘‘మంచి.. చేడు.. అనేవి నేను చూడను. ప్రతి మనిషి అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఓ నిర్ణయం తీసుకుంటాడు. దాని వల్ల మంచి జరిగితే అతన్ని మంచోడంటారు. చెడు జరిగితే చెడ్డొడంటారు. అయితే ఆయా వ్యక్తుల జీవితాల్లో ఉండే డ్రామానే నాలోని దర్శకుడ్ని ఎక్కువ ఆకర్షిస్తుంది’’ అన్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన నుంచి వస్తున్న సినిమా ‘ఆశ: ఎన్‌కౌంటర్‌’. సోనియా టైటిల్‌ పాత్రలో నటించింది. ఆనంద్‌ చంద్ర తెరకెక్కించారు. అనురాగ్‌ కంచర్ల నిర్మించారు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు వర్మ.

దర్శకత్వం.. నిర్మాణం.. అని కాకుండా ఈ మధ్య ప్రతి సినిమాకీ ‘ఆర్జీవీ చిత్రం’ అని వేసుకుంటున్నారు. ఆయా చిత్రాల విషయంలో మీ పాత్రేంటి?

‘‘ఓ కథాలోచన చేసి.. నాకున్న అనుభవంతో దాన్ని సినిమాగా ఎలా మలిస్తే బాగుంటుందో ఆలోచించి.. ఆ ప్రాజెక్ట్‌ను ఓ దర్శకుడి చేతుల్లో పెడతా. అందుకే ఆ సినిమాని ఎవరు తెరకెక్కించినా.. అందులో నా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ‘ఆర్జీవీ చిత్రం’ అని పెడుతుంటా. ఇప్పుడీ ‘ఆశ’ చిత్రం విషయానికే వస్తే.. ఈ కథ విషయమై చాలా మంది పోలీస్‌ అధికారులతో మాట్లాడా. దానిపై చాలా రీసెర్చ్‌ చేశా. అయితే ఆ ఘటనను మేము ఏ కోణం చెప్పామన్నది తెరపై చూడాలి’’.

‘ఆశ’ కథపై రీసెర్చ్‌ చేశారు కదా.. దాన్ని మీరు తెరకెక్కించలేదెందుకు?

‘‘ఒక సీన్‌ కంటెంట్‌ విషయంలో క్లారిటీ ఉన్నప్పుడు.. అది నేను తీసినా మరొకరు తీసినా పెద్ద తేడా ఉండదు. నేనెలాగో కథ పరంగా కొన్ని పరిధులు ఫిక్స్‌ చేశా. దాన్ని నేను తీసినా.. ఇంకొకరు తీసినా ఆ పరిధి దాటి పోలేరు కదా. ఆ నమ్మకంతోనే ఈ కథని మరొకరి చేతుల్లో పెట్టా. ఆనంద్‌ చంద్ర మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ కథను అతను సమర్థంగా తెరకెక్కించగలడనిపించి తనకే  దర్శకత్వ బాధ్యతలు అప్పగించా’’.

కల్పిత కథతో తెరకెక్కించామంటున్నారు మీరు. ట్రైలర్‌లో సన్నివేశాలు దిశ సంఘటనల్ని పోలి ఉన్నాయి కదా?

‘‘ఇందులో చూపించిన ఘటనలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి. ఇది ప్రత్యేకంగా ఓ అమ్మాయి విషయంలో  జరిగినదే కాదు. అందుకే కల్పిత కథ అని పెట్టాం. నిర్భయ కేసు కావొచ్చు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన కావొచ్చు.. అన్నింటిలోనూ ఓ కామన్‌ పాయింట్‌ ఉంటుంది. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించింది.. ఓ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసి ఏదో చేసింది.. అంతే. ఎవరెంత గోల చేసినా.. ఎన్ని కొత్త చట్టాలు చేసినా అలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారకుల్ని ఏదో రకంగా శిక్షించేస్తున్నారు.  అయితే ఆ ఘటనకు ముందు వరకు ఆ నలుగురు వ్యక్తులు మనలాగా మామూలు మనుషులే. ఎలాంటి క్రైమ్‌ రికార్డ్స్‌ లేవు. కానీ, ఆ ఒక్కరోజు సాయంత్రం.. ఆ నిమిషంలో వాళ్లెలారాక్షసులుగా మారిపోయారన్నది స్టడీ చేయడం చాలా ముఖ్యం. అసలు వాళ్లకు ఆ ఆలోచన ఎందుకొచ్చింది? దేని వల్ల ఆ నేరానికి పాల్పడ్డారు? తెలుసుకోగలగాలి. సాక్ష్యాధారాలతో ఆ నేరాన్ని కోర్టు ముందు నిరూపిస్తే.. నిందితులకు ఏ శిక్ష వేయాలన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఈ ప్రాసెస్‌ని పక్కకు పెట్టి.. నేరుగా కాల్చి చంపేస్తే అప్పుడది పోలీస్‌స్టేట్‌ అయిపోదా?’’.

ఈ చిత్రంలో ఏం చూపించనున్నారు?  

‘‘ఆశ హత్యాచార ఘటనకు కారకులైన నలుగురు వ్యక్తులు లారీ దగ్గర కూర్చొని ఏం మాట్లాడుకున్నారు? అప్పుడు వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంది? అన్నది సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశా. రేప్‌ ఎపిసోడ్‌ సినిమాలో 45నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత సాక్ష్యాలు మాయం చేయడానికి ఆమెని ఎలా హత్య చేశారు? ఆ బాడీ దొరక్కుండా ఉండటానికి ఏం చేశారు? ఈ క్రమంలో వాళ్లు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకున్న కారణమేంటన్నది ఆసక్తికరంగా చూపించాం’’.

‘‘ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘కొండా’ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పూజా బాలేకర్‌తో చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమా ‘అమ్మాయి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఉపేంద్రతో చేయనున్న కొత్త చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో ఓ హారర్‌ సినిమా చేయనున్నా’’.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ రేట్లు తగ్గించడం పట్ల మీ అభిప్రాయమేంటి?

‘‘రాజమౌళి లాంటి దర్శకుడున్నారు. తెలుగు సినిమా రెవెన్యూ రూ.100 కోట్లు ఉంది అనుకున్నప్పుడు రూ.200 కోట్లు పెట్టి ‘బాహుబలి’లాంటి చిత్రం తీశారు. అది సూపర్‌గా వర్కవుటయ్యి.. అంతకు మించిన వసూళ్లు సాధించింది. తెలుగు చిత్రాల్ని అంతర్జాతీయ స్థాయిలో సీరియస్‌గా గుర్తిస్తారా? అన్న తరుణంలో.. ఆ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడా రెవెన్యూని మరింత పెంచడానికి రూ.400 కోట్లతో మరో సినిమా చేశారు. అలాంటి పెద్ద చిత్రాన్ని.. రూ.1కోటి ఖర్చుతో తీసిన ఓ చిన్న సినిమా టికెట్‌ రేట్‌తో సమానంగా అమ్మాలనడం సమంజసం కాదు. అందరూ దేహాన్ని కప్పుకోవడానికే బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు రూ.2వేలల్లో మామూలువి కొంటావా? రూ.50వేలతో బ్రాండ్‌వి కొంటావా? అన్నది వాళ్ల వాళ్ల స్థోమతని బట్టి ఉంటది. ఇది వినియోగదారుడికి.. ఉత్పత్తిదారుడికి మధ్య సాగే వ్యవహారం. బట్టలన్నవి నిత్యావసర వస్తువులు.. అది రూ.50వేలతో చేసిందే అయినా రూ.50కే అమ్మాలంటే ఉత్పత్తిదారుడు వాటిని తయారు చేయడమే మానేస్తాడు’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts