Oke Oka Jeevitham:జీవితాంతం చెప్పుకొనేలా...‘ఒకే ఒక జీవితం’

శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూవర్మ కథా   నాయిక. శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 30 Dec 2021 07:32 IST

శర్వానంద్‌

శర్వానంద్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూవర్మ కథా   నాయిక. శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమల అక్కినేని ముఖ్యభూమిక పోషించారు. సైంటిఫిక్‌ అంశాలతో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాకి తరుణ్‌ భాస్కర్‌ మాటల్ని సమకూర్చారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు  ఆశ్చర్యపోవచ్చు, అసలు నమ్మకపోవచ్చు. కానీ ఇది నమ్మే తీరాలి...’ అంటూ మొదలయ్యే టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. టీజర్‌ విడుదల అనంతరం శర్వానంద్‌ మాట్లాడారు. ‘‘జీవితాంతం ఇది నా సినిమా అని చెప్పుకొనేలా ఉంటుంది. ఈ కథ చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. కథకి ఆత్మలాంటి పాత్రలో ఆమెని మాత్రమే ఊహించుకున్నా. జేక్స్‌ బిజోయ్‌ సమకూర్చిన అన్ని పాటలూ చాలా బాగుంటాయి. ముఖ్యంగా అమ్మ పాట. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్‌ తొమ్మిది నెలలు రాశారు. ఆ పాట కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అమల మేడమ్‌,   సిరివెన్నెల సర్‌ మాతృమూర్తులతోపాటు, మా అమ్మని ఆహ్వానించి అక్కడ విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ముందు ఒక కథ రాశా. అందులో భావోద్వేగాలు కనిపించలేదు. ఆ తర్వాత మా అమ్మ చనిపోయారు. అప్పుడు మళ్లీ కథ రాసేందుకు కూర్చున్నా. అమ్మని చూడాలనిపించింది. అమ్మని చూడాలని రాసిన ఒక్క సన్నివేశం అలా పెరిగి ‘ఒకే ఒక జీవితం’ సినిమాగా మారింది. శర్వా నటించినప్పుడు తన పాత్రలో నన్ను నేను చూసుకున్నా. తను ఈ చిత్రంతో అందరినీ 90వ దశకంలోకి తీసుకెళతాడు. ఇందులోని అమ్మ పాత్ర రాసినప్పుడే అది అమల మేడమే చేయాలనుకున్నా. భావోద్వేగాలతోపాటు ఇందులో కామెడీ ఉంటుంది. ఈ సినిమా కోసం నేను, నా బృందం ఆరేళ్లు ప్రయాణం చేశాం. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమా కోసం చాలా   కష్టపడ్డార’’న్నారు. అమల అక్కినేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో అందరికీ అమ్మను  అయిపోయా. కథ చెప్పినప్పుడు మిగిలిన   సినిమాలు చేసినా చేయకపోయినా ఈ పాత్ర చాలు అనిపించింది. శ్రీకార్తీక్‌ ఎంతగా కష్టపడ్డాడో, ఈ చిత్రంతో తనకి అంతగా పేరొస్తుంది’’ అన్నారు. ఈ సినిమా మనందరి మనసుల్ని తాకుతుందన్నారు తరుణ్‌భాస్కర్‌. ఈ కార్యక్రమంలో సతీష్‌, ఎడిటర్‌ శ్రీజిత్‌, ఛాయాగ్రాహకుడు సుజిత్‌, సంగీత దర్శకుడు జేక్స్‌ బిజోయ్‌, నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని