Vetri Maaran: ఇటు సూర్య.. అటు ధనుష్‌.. అప్‌డేట్స్‌ ఇచ్చిన వెట్రిమారన్‌

సూర్య హీరోగా దర్శకుడు వెట్రి మారన్‌ గతంలో ‘వాడి వాసల్‌’ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం గురించి వెట్రిమారన్‌ మాట్లాడారు.

Published : 27 Jun 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉన్న దర్శకుడు.. వెట్రిమారన్‌ (Vetrimaaran). ఈ ఏడాది ‘విడుతలై: పార్ట్‌ 1’ (తెలుగులో విడుదల) (Viduthalai Part 1)తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ప్రస్తుతం దానికి కొనసాగింపు సినిమా పనుల్లో తలమునకలై ఉన్నారు. చెన్నైలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ‘వాడి వాసల్‌’ అప్‌డేట్‌తోపాటు ధనుష్‌ హీరోగా చేయబోయే హిట్‌ సినిమా సీక్వెల్‌ గురించి మాట్లాడారు.

సూర్య (Suriya) హీరోగా వెట్రిమారన్‌.. ‘వాడి వాసల్‌’ (Vaadivaasal) సినిమాని 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ కారణంగా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది.ఆ తర్వాత, షూటింగ్‌ ఎంత వరకు పూర్తయింది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? తదితర వివరాలేవీ చిత్ర బృందం పంచుకోలేదు. తాజా ప్రెస్‌మీట్‌లో వెట్రిమారన్‌ ఆ సమాచారం ఇచ్చారు. ‘విడుతలై: పార్ట్‌ 2’ పని పూర్తికాగానే ‘వాడి వాసల్‌’ చిత్రీకరణ పునః ప్రారంభించనున్నట్టు చెప్పారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో ఇప్పటికే సీజీ పనులు మొదలయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలన్నీ పూర్తయ్యాక ‘వడ చెన్నై’ (Vada Chennai)కి సీక్వెల్‌ చేసే అవకాశం ఉందన్నారు. ధనుష్‌ (Dhanush) హీరోగా ఆయన గతంలో తెరకెక్కించిన ‘వడ చెన్నై’ తమిళనాట హిట్‌గా నిలిచింది. మరోవైపు, విజయ్‌ (Vijay)తో కలిసి ఓ సినిమా చేసేందుకు చర్చలు సాగుతున్నాయని తెలిపారు. ‘విడుదల’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన వెట్రి మారన్‌.. టాలీవుడ్‌ ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయనుండడంపై స్పందించారు. ‘‘ఆయనతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. అది సోలో హీరో మూవీనా, మల్టీస్టారరా? అనే విషయం కాలమే సమాధానం చెబుతుంది. అలాగే, ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న దానిపై నాకు స్పష్టత ఉంది. స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ వాల్యూ కాకుండా మేము ఎంచుకునే కంటెంట్‌ ఫలానా స్టార్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అతనితో సినిమా చేస్తా’’ అని వెట్రిమారన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని