TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అవధాన వైభవం’

తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65వ సాహిత్య సమావేశం ‘ అవధాన వైభవం.. నేటి అవధానుల నోట... నాటి మేటి అవధానుల సాహితీఝరి’ ఘనంగా జరిగింది.

Updated : 27 Feb 2024 23:58 IST

టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65వ సాహిత్య సమావేశం ‘అవధాన వైభవం.. నేటి అవధానుల నోట.. నాటి మేటి అవధానుల సాహితీఝరి’ ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు సభను ప్రారంభించారు. అనంతరం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అవధానులతోపాటు అమెరికాలోని మరికొంతమంది అవధానులు పాల్గొన్న ఈ కార్యక్రమం సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ‘‘13వ శతాబ్దకాలం నుంచి అవధానకళ ఉన్నప్పటికీ, విద్వాన్ మాడభూషి వేంకటాచార్యులను ఆధునిక కాలంలో అవధానానికి ఆద్యులుగా పరిగణిస్తారు. 150 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 22, 1872న కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి అవధానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి విశిష్ట అవధానకళ అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత, తెలుగు ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలపై ఉంది’’ అని అన్నారు.

    

ముఖ్యఅతిథిగా హాజరైన అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ.. తెలుగు వారికే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో ఎందరో అవధానులు అత్యంత ప్రతిభావంతంగా అవధానాలు చేశారని అన్నారు. కాలక్రమంలో ఈ కళలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, యువ అవధానులను తయారుచెయ్యడం, అవధానవైభవం కోల్పోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా శతావధాని గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి అవధాన వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. 
     
విశిష్ట అతిథులుగా పాల్గొన్న అవధానులలో.. మహిళావధాని డా. బులుసు అపర్ణ.. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సాహితీ వైభవాన్ని, డా.బోచ్కర్ ఓం ప్రకాష్ .. తిరుపతి వేంకటకవుల వైభవాన్ని, ఆముదాల మురళి.. ప్రకాశరావు అవధాన విన్యాసాలను, డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ-  వేంకట రామకృష్ణకవుల అవధాన కళను విశ్లేషించారు. 17 సంవత్సరాల వయస్సులోనే శతావధానం చేసిన ఉప్పలదడియం భరత్ శర్మ ..డా. కడప వెంకట సుబ్బన్న పాండిత్య ప్రతిభను వివరించారు. అమెరికాదేశపు తొలి అవధాని డా. పుదూర్ జగదీశ్వరన్.. కొప్పరపు సోదరకవుల ఆశుకవితా పద్యవేగం గురించి, అమెరికా అవధాని నేమాని సోమయాజులు.. నేమాని రామజోగి సన్యాసిరావు సాహిత్య వైభవం గురించి వివరించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న అవధానులందరూ అలనాటి అవధానుల సమస్యాపూరణం, దత్తపది, ఆశుకవితా అంశాలను గొప్పగా ఆవిష్కరించి సభను విజయవంతం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని