BATA: ఘనంగా ముగిసిన ‘బాటా’ సంక్రాంతి సంబరాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.

Published : 29 Jan 2024 23:20 IST

అమెరికా: బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా వంటల పోటీలు, ముగ్గులు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, మెలోడీ పాటల పల్లకి వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత కచేరీ, క్లాసికల్ డ్యాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, వేదికపై గేమ్ షో, డ్యాన్స్‌లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా 30 రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆహూతులు ఆరగించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమై రాత్రి 10గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా అతిథులు వచ్చారు. ఆడిటోరియాన్ని సంక్రాంతి పండుగ శోభ ప్రతిబింబించేలా తెలుగు లోగిళ్లు ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్‌డ్రాప్‌లు, రంగురంగుల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు, కంటెస్టెంట్లు, బాటా వాలంటీర్ల సంప్రదాయ దుస్తులు, వారి అలంకరణలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ‘పాటల పల్లకి’తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో BATA కరోకే బృందంలోని ప్రతిభావంతులైన గాయకుల లైవ్ పెర్ఫామెన్స్‌, సంగీత కచేరీ, టాలీవుడ్ గాయని ఐశ్వర్య పాడిన సూపర్ హిట్ పాటలు ఆహూతులను ఉర్రూతలూగించాయి. తానా, బాటా ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించేందుకు, బోధించేందుకు ఏర్పాటు చేసిన తెలుగు ‘పాఠశాల’ విద్యార్థులు చేసిన స్కిట్, ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తెలుగు భాషను నేర్చుకోవాలన్న ఉత్సాహం ఆకట్టుకుంది. 

పెద్దలకు (సూపర్ చెఫ్), పిల్లలకు (లిటిల్ చెఫ్), రంగురంగుల రంగవల్లి పోటీలు, కళాపోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పిల్లలు ఇంటి నుంచి తీసుకొచ్చిన సరకులతో తల్లిదండ్రుల సహాయం లేకుండా అక్కడికక్కడే వారికి నచ్చిన వంటకాన్ని తయారు చేసి తమ వంట నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూపర్ చెఫ్ ద్వారా పురుషులు, మహిళలు తమ పాక శాస్త్ర ప్రావీణ్యతను చాటుకున్నారు. రంగవల్లిలను చూసి సంక్రాంతి నాటి తెలుగు లోగిళ్లు గుర్తుకు వచ్చాయి. సాయంత్రం 5గంటలకు భోగిపళ్ల కోసం పిల్లలందరినీ ఆహ్వానించడంతో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలు భక్తి పాటలు పాడుతూ సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావడం "వసుధైక కుటుంబం" కాన్సెప్ట్‌ను తలపించింది. పిల్లలందరికీ పెద్దలు ఆశీస్సులు అందజేశారు. అంతేకాకుండా, రంగురంగుల సంప్రదాయ చీరలు ధరించిన మహిళలందరితో ‘గొబ్బెమ్మల’ నృత్యం జరిగింది. 30కి పైగా వంటకాలతో సంక్రాంతి విందు భోజనం వడ్డించారు. సంప్రదాయ తెలుగు మిఠాయిలు, తినుబండారాలు, పచ్చళ్లు, పులిహోర, పనసపొట్టు పలావ్, పెరుగన్నం, గుత్తి వంకాయ, బెండకాయ ఇగురు, ముద్ద పప్పు, దప్పలం, కిల్లీ (పాన్), ఇతర ఆహార పదార్ధాలతో ఆహూతులకు తెలుగింటి భోజనం రుచిచూపించారు. స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్ వారు తయారు చేసిన ఈ విందును అతిథులు ఆస్వాదించారు.

ఏఐఏ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

మరోవైపు, అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్నికైన అధికారులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ కె.శ్రీకర్ రెడ్డి హాజరయ్యారు. మోంటానో (మేయర్ మిల్పిటాస్), అలెక్స్ లీ (అసెంబ్లీ సభ్యుడు), మురళీ శ్రీనివాస్ (సన్నీవేల్ వైస్ మేయర్), షీలా మోహన్ (కుపర్టినో మేయర్), కౌన్సిల్ సభ్యులు రాజ్ సాల్వాన్, రాజ్ చాహల్, ఒట్టో లీ (సూపర్‌వైజర్), ఇతర ఎన్నికైన అధికారులు, AIA నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆహుతులంతా చిన్న పిల్లలు చేసిన డ్యాన్స్, పాటల పల్లకిని, ప్రత్యేక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమంలో పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అధికారులు సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన AIA, BATA టీమ్‌ల సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ హిట్ పాటలకు చిన్న పిల్లలు, BATA యువకులు చేసిన హై ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. శాన్ జోస్, కుపెర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామోన్ మొదలైన ప్రదేశాల్లో చిన్నారులకు డ్యాన్స్‌లో శిక్షణను ఇచ్చేందుకు BATA టీమ్ సభ్యులు కష్టపడి పనిచేశారు. అద్భుతమైన విజువల్స్, మేకప్, దుస్తులతో ‘స్టార్ట్ కెమెరా యాక్షన్’ (ఫ్యాషన్ షో) ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఆన్-స్టేజ్ గేమ్ షోలో చాలామంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థల నుంచి విశేష మద్దతు లభించింది. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ స్పాన్సర్ ‘సంజయ్ టాక్స్‌ప్రో’, ‘పవర్డ్ బై’ స్పాన్సర్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్యగోల్డ్ స్పాన్సర్ ‘శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్’ ఇతర స్పాన్సర్‌లు PNG జ్యువెలర్స్, TASQA.AI & Vyzn రియల్టర్లు మీడియా స్పాన్సర్ 'నమస్తే ఆంధ్ర' వాలంటీర్లు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు BATA అధ్యక్షుడు కొండల్ కొమరగిరి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధి, రవి తిరువీదుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి ,సుమంత్ పుసులూరితో కూడిన ‘స్టీరింగ్ కమిటీ’.. శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన ‘సాంస్కృతిక కమిటీ’, సందీప్ కేదార్ శెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన ‘లాజిస్టిక్స్ టీమ్’ , సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూరలతో కూడిన యూత్ కమిటీని ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన BATA బృందానికి బాటా ‘సలహా మండలి’ సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని