హాంకాంగ్‌లో ఘనంగా శ్రీ శోభకృత్‌ ఉగాది వేడుకలు

మూడు సంవత్సరాల అనంతరం హాంకాంగ్‌లోని ఇండియా క్లబ్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

Published : 02 Apr 2023 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడేళ్ల  తర్వాత  హాంకాంగ్‌లోని ఇండియా క్లబ్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. హాంకాంగ్‌లోని భారత ప్రభుత్వ దౌత్యాధికారిణి రెజీనా వర్గీస్‌ జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భాషకు, సంస్కృతికి గుర్తింపునిచ్చే ఉగాది పండుగను అంతా ఒక చోట చేరి ఉత్సాహంగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలు మరెన్నో చేయాల్సిన అవసరం ఉందన్నారు. భావితరానికి వారసత్వంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ మహిళా విభాగం ‘సఖియా’ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. సంజయ్ వాడపల్లి నృత్య ప్రదర్శన, శాంకరి బెల్లంకొండ కూచిపూడి నాట్య ప్రదర్శన వీక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో ‘యమగోల’, ‘డోంట్ స్టాప్ లాఫింగ్  ఫ్రెండ్స్ లొల్లి లోడింగ్’ నాటికలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. పాటలు, నృత్యాలతో సమాఖ్య సభ్యులందరూ కలిసి ఒక కుటుంబంలా పండుగ వేడుకగా నిర్వహించుకున్నారు.  సాంస్కృతిక వేదిక రథ సారథులుగా వినూత్న, నీలిమ, గోపి వ్యవహరించారు.  శ్రీ శోభకృత్‌ ఉగాది వేడుకలకు విశేష అతిథులుగా చిన్మయ మిషన్ హాంకాంగ్‌ స్వామి సుప్రియానంద విచ్చేసి శుభకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. స్థానిక అధికారులు మిస్ ఏవా చొయ్, మిస్టర్ హుంగ్ కా వాయి, మిస్ మిటజీ లీయోంగ్‌, ఇండియా క్లబ్ అధ్యక్షుడు శ్రీ నాను లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.  ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇండియా, శుభోదయం గ్రూప్, ఇండియా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా  సంయుక్తంగా గత ఏడాది ఆన్‌లైన్‌లో ఘంటసాల స్వరరాగ మహాయాగం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గాయని గాయకులు హర్షిణి పచ్చంటి, గాయత్రి, ఈరంకి శ్రీహరి బాలాదిత్య, కోట్ల సత్యనారాయణ, ఫణి కుమార్ కొత్తూరు, జైరాం పరమేశ్వరన్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. 

తెలుగు భాష, సంస్కృతి ఉన్నతికి చేస్తున్న కృషిని కొనియాడుతూ ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి రెజీనా వర్గీస్‌, సుజాత గోవాడ, అరుణ పాముల సత్కరించారు.  సమాఖ్య నిర్వహించిన  క్రీడా పోటీల విజేతలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సత్కరించారు. ప్రధాన కార్యవర్గ సభ్యులైన రాజశేఖర్ మన్నే, రమాదేవి సారంగా, మాధురి కొండ, హరీన్ తుమ్మలను అభినందించి సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి సారంగ రమాదేవి వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని