సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

కాకతీయ కల్చరల్ అసోసియేషన్- సింగపూర్ (KCAS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి,

Published : 05 Feb 2024 19:48 IST

సింగపూర్‌: కాకతీయ కల్చరల్ అసోసియేషన్- సింగపూర్ (KCAS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD) ఆడిటోరియం హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. దాదాపు 750 మంది పాల్గొన్న ఈ వేడుకలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆటపాటలతో ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.  తెలుగు వంటకాలతో కూడిన భోజనాలతో పాటు ఈ వేడుకల్లో ప్రతిఒక్కరినీ భాగస్వాముల్ని చేసేలా కార్యక్రమాలు రూపొందించిన నిర్వాహకుల్ని ఆహూతులు అభినందించారు.  చిన్నారులు చిత్రలేఖనం, ఆటలు, నృత్యాలు, నాటికలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ కోలాటం, పురుషుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ.. సంక్రాంతి పండగను ఇంతమంది తెలుగు వారి మధ్య సింగపూర్‌లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగువారు ఎక్కడున్నా తమ సంస్కృతీ, సంప్రదాయాలను మరిచిపోరని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. తమ సంస్థ ద్వారా నిర్వహించాలనుకున్న కార్యక్రమాలకు ఈ ఈవెంట్‌ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు.  ఇది విజయవంతం కావడానికి సహకరించిన బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సంస్థ కార్యక్రమాలకు ఎప్పటిలాగే ఈసారి కూడా స్పాన్సర్స్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.  ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే సంక్రాంతి పండగ విశిష్టతను అందరికీ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని