జ్ఞాన సమృద్ధం.. మృదుస్వభావ భరితం.. ఇది నవ భారత్‌: శ్రీశ్రీ రవిశంకర్‌

 భారతదేశపు శక్తిసామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ప్రస్తుతం భారత్‌ కేవలం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మాత్రమే కాదని, సాంస్కృతిక వైవిధ్యాలకు పట్టుగొమ్మగా, వివిధ మత ధర్మాల ఆత్మీయ సమ్మేళనంగా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మనల్ని తీసుకొనిపోయే భూమిగా విరాజిల్లుతోందని శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు.

Updated : 26 Jan 2024 02:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ తన సందేశాన్ని వినిపించారు. భారతదేశపు శక్తిసామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం భారత్‌ కేవలం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మాత్రమే కాదని, సాంస్కృతిక వైవిధ్యాలకు పట్టుగొమ్మగా, వివిధ మత ధర్మాల ఆత్మీయ సమ్మేళనంగా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మనల్ని తీసుకొనిపోయే భూమిగా విరాజిల్లుతోందన్నారు. పలు అంశాలపై శ్రీశ్రీ రవిశంకర్‌ తన వాణిని వినిపించారు.  

‘‘దేశంలో అభివృద్ధి చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే మనం సరైన దిశలోనే వెళ్తున్నామని గుర్తించాలి. ముందు తరాల భవిష్యత్తు ఈ దేశంలో మరింత ఉజ్వలంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. భారతదేశం ఎల్లప్పుడూ చిత్తశుద్ధికి, న్యాయానికి కట్టుబడే ఉందనే విషయాన్ని ప్రపంచం ఇప్పుడిప్పుడే గమనించడం ప్రారంభించింది. మనం జ్ఞానం కలిగినవారం. అదిలించో, బెదిరించో మనల్ని ఎవరూ లొంగదీసుకోలేరు. అదే సమయంలో మనం ప్రపంచంలోని ప్రజలందరి మనోభావాలు, బాధల విషయంలో చాలా సున్నితంగా స్పందిస్తాం. ప్రపంచశాంతి నెలకొల్పడంలో భారతదేశం పోషించగలిగే పాత్రను ప్రపంచం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.

అంతటి వైవిధ్యాన్ని మనం స్వీకరించి పోషిస్తున్నాము. భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల సమాహారం. అన్ని సంప్రదాయాలను, మతాలను మనం గౌరవిస్తాము. అన్ని మతాలూ ఈ దేశంలో స్థానం పొందాయి. అన్ని మతాలు ఇక్కడ గౌరవం పొందతున్నాయి. మనదేశంలో ఒక ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య దేశాల్లో చాలా చోట్ల రెండు, మూడు పెద్ద పార్టీలే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా మనది. ప్రస్తుత కాలం మన చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని నాకు అనిపిస్తుంది. మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాము. భారతదేశ వైభవాన్ని, మన సంస్కృతిని, నాగరికతను గుర్తించాం. ఇది మన యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రోజున వారు మన చరిత్ర, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇదంతా మన మృదువైన శక్తి. 

కొన్నేళ్ల క్రితం అమెరికాలో జరిగిన ఇంటర్వ్యూ.. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం కాకుండా నియంతృత్వం ఉండి ఉంటే ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి చెంది ఉండేదా?’ అని అడిగారు. నెమ్మదిగా ఎదిగినా ప్రజాస్వామ్యాన్నే ఇష్టపడతామని స్పష్టం చేశాము. ప్రజాస్వామ్యంలో ప్రతీ గొంతునూ వింటాం. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. సమగ్రాభివృద్ధికి అందరి గొంతులూ వినిపించాలి. బలమైన గొంతుకలు వినిపించాలి. తెలివైన గొంతుకలు వినిపించాలి.

కుటుంబంలో ప్రతి సభ్యునికీ తమ లక్ష్యం గురించి పూర్తి అవగాహన ఉండి, అవసరమైనప్పుడు వ్యతిరేకించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆ కుటుంబం సామరస్యంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే, అవసరమైనప్పుడు సహకరిస్తారు. మొత్తం మీద, ప్రతి ఒక్కరూ అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు. శాంతియుతమైన, సంతోషకరమైన కుటుంబంగా ముందుకు సాగుతారు. మన భారతదేశం సరిగ్గా ఇదే విధంగా ఉంది. ప్రతిపక్షాల గొంతు చాలా ముఖ్యం. ఏ ప్రజాస్వామ్యానికైనా అది తప్పనిసరి. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. ప్రతిపక్షాలు, తాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనినీ వ్యతిరేకించడం కాకుండా, ప్రభుత్వంలోని లోపాలను తప్పక ఎత్తి చూపాలి. ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ కలసి మెలసి సంబరాలు చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సమాజంలోని వివిధ వర్గాల మధ్య సహకారమే దేశాన్ని ప్రగతి పథంలో వేగంగా పరుగెత్తేలా చేస్తుంది. 

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న వారు తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలి. ఇది మీ పవిత్ర కర్తవ్యం. ఓటు వేసేటప్పుడు, మీ కులం, వర్గం, మతం లాంటివి చూడకుండా, మంచివారికి, సమాజానికి మేలు చేయగలిగే వ్యక్తికి ఓటు వేయండి. అభ్యర్థులు మీ నుంచి ఓటు అడగడానికి వచ్చినప్పుడు దేవతలవలే ప్రవర్తించండి. అలాగే అని, వారి మాటలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పండి. వారు డబ్బు ఇవ్వజూపితే, మీ ఓట్లను కొన్ని కరెన్సీ నోట్లకు అమ్ముకోకండి. అది మీ ఆత్మను అమ్ముకున్నట్లే. ‘ఓటు వేసేందుకు డబ్బు తీసుకోను’ అనేది మీ విధానం కావాలి. మన ప్రజలు చాలా తెలివి గలవారు. భారత్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఉత్సాహభరితమై, సజీవంగా ప్రాణశక్తితో విరాజిల్లుతున్న ప్రజాస్వామ్యం. దానిని నిలబెట్టుకోవడం మన సమష్టి బాధ్యత’’ అని గురుదేవ్‌ శ్రీశ్రీ రవి శంకర్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని