సింగపూర్‌లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

సింగపూర్‌లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 13 Mar 2024 22:28 IST

సింగపూర్‌: సింగపూర్‌లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సింగపూర్‌లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి, ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం,  మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది దశమ వార్షికోత్సవం జరుపుకోనున్న తరుణంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి  పర్వదిన సందర్భంగా మార్చి 8న రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు శ్రీఅరసకేసరి శివాన్‌ మందిరం ప్రాంగణంలో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. 

భారత్‌ నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో పంచ లింగాలను పార్థివ లింగాలుగా సమంత్రకంగా చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచ రుద్రులకు ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సింగపూర్‌లో నివసించే తెలుగు బ్రాహ్మణులు 100 మందికి పైగా వచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతో అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు భక్తులు మాట్లాడుతూ.. సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం అద్భుతమైన భక్తి కార్యక్రమం నిర్వహించిందన్నారు. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. తొలిసారి నిజమైన జాగరణ చేసినట్లు చెప్పారు. మహాశివరాత్రి రోజున అభిషేకం చేయడం, అందులోనూ పంచారామ లింగార్చనతో కూడిన జాగరణ అంతా శివమయమైందని చెప్పడం అతిశయోక్తి కాదంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని