‘కళాభారతి’కి నీరాజనం.. జమున నటనా కౌశలంపై వక్తల ప్రసంగాలు

వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునకు ఘన నివాళులర్పించారు.

Published : 04 Feb 2024 19:00 IST

సింగపూర్‌: వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాల్లో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘మీరజాలగలడా నా యానతి’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించారు.  భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, ఉగాండా, కెనడా, అమెరికా దేశాల నుంచి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుంచి 35 ఆణిముత్యాలైన  సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రల్లో ఒదిగిపోయిన తీరు గురించి విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర చెన్నై నుంచి  పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాల గురించి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని వివరించారు. 

జమున కుమారుడు, అమెరికాలో నివసిస్తున్న డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని తన మాతృమూర్తి  చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విదేశాల వారితోపాటు  హైదరాబాద్ నుంచి ప్రముఖ రచయితలైన ఆచార్య టి. గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి తదితరులు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం.  ‘ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే 10 దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలోనే ఈ వ్యాసాలను వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తాం’ అని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. 

రచయిత్రి రాధిక మంగిపూడి సభా నిర్వహణ చేయగా.. అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాల్లో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని రచయితలు చక్కగా అభివర్ణించారు. సినిమాలతో పాటు జమునతో తమకు ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని తలచుకుంటూ ఆమెకు నివాళులర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణ సహకారం అందించారు. కల్చరల్ టీవీ, శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని