సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 3న స్థానిక సింగపూర్ పీజీపీ హాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సందడి వాతావరణంలో నిర్వహించారు.

Published : 06 Feb 2024 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 3న స్థానిక సింగపూర్ పీజీపీ హాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సందడి వాతావరణంలో నిర్వహించారు. సంక్రాంతి శోభతో తీర్చిదిద్దిన ప్రాంగణంలో హరిదాసు కీర్తనలు, యువతులతో గొబ్బెమ్మ పాటలు, భోగి పండ్ల వేడుక అలరించాయి. మహిళలకు రంగవల్లులు, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పిల్లలు, పెద్దలు ప్రదర్శించిన నాటికలు, విభిన్న కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సుమారు 35 మంది బాలబాలికలు రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. సింగపూర్‌లోని తెలుగు మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఆగ్నేయాసియాలో ప్రప్రథమంగా సింగపూర్‌ కాలమానంలో గుణించిన తెలుగు క్యాలెండర్‌ను వరుసగా ఏడోసారి ఆవిష్కరించారు. సంబరాలకు వచ్చిన అందరికీ దాన్ని ఉచితంగా అందజేశారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లోనూ STS TELUGU CALENDER పేరుతో అందుబాటులో ఉంచారు. అనంతరం తెలుగు సమాజం కార్యవర్గం, కొన్ని స్థానిక రెస్టరంట్‌ల సహకారంతో ఏర్పాటు చేసిన తెలుగు పిండివంటలు, 34 రకాల వంటకాలతో కూడిన భోజనం అందరికీ వడ్డించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది కాలంగా తమ కార్యవర్గం నిర్వహించిన కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. 50వ ఆవిర్భావ దినోత్సవంలోపు సింగపూర్ తెలుగు సమాజానికి భవనం నిర్మించే దిశగా తోడ్పాటు అందించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సుమారు 700 తెలుగువారు పాల్గొన్నారని.. దాదాపు 5వేల మంది ఆన్‌లైన్‌లో వీక్షించినట్లు నిర్వాహకురాలు సుప్రియా కొత్త తెలిపారు. స్వచ్ఛంద సేవకులు, కార్యక్రమానికి స్పాన్షర్లుగా వ్యవహరించిన వారికి కార్యవర్గం తరఫున కార్యదర్శి అనిల్‌ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని