అన్ని బీమా పాల‌సీల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ క‌వ‌రేజ్ ల‌భిస్తుందా?

మీ ఓపీడీ కవర్ వ్యాక్సిన్ల ఖ‌ర్చు చెల్లిస్తుందో లేదో ప‌రిశీలించ‌డం చాలా ముఖ్యం

Published : 27 Dec 2020 20:09 IST

నిర్దిష్ట ఆరోగ్య బీమా పాలసీలు మాత్రమే కోవిడ్ -19 వ్యాక్సిన్ల ఖర్చును భరిస్తాయి. ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ర్టాజెనికా త‌యారీకి సంబంధించి పూణెకు చెందిన సీరమ్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ టీకా అన్ని ట్ర‌య‌ల్స్ పూర్తి చేసి ఈ ఏడాది చివ‌రి నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. భారతీయులు దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అయితే టీకా ధ‌ర సామాన్యుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని సీర‌మ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. దీంతోపాటు ఇతర టీకాలు కూడా ట్రయల్ దశలో ఉన్నాయి.

కోవిడ్ సోకిన రోగిని ఆసుపత్రిలో చేర్చి, కోవిడ్ -19 మందులకు సంబంధించిన‌ ఖర్చులు అన్ని ఆరోగ్య బీమా పాలసీల పరిధిలో ఉంటాయి. అయితే వ్యాక్సిన్‌ అవుట్-పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) ప్రాతిపదికన అందిస్తే వైద్య నిపుణులు సూచించిన‌, ఓపీడీ ఖర్చులను చెల్లించే పాలసీలు మాత్రమే వ్యాక్సిన్ ఖ‌ర్చుల‌ను భ‌రిస్తాయి. సాధారణంగా, ఓపీడీ కవర్ కలిగి ఉన్న అన్ని పాల‌సీల్లో టీకాల‌కు క‌వ‌రేజ్ ఉంటుంది. ఇవే నిబంధ‌న‌లు కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు కూడా వర్తిస్తాయి.

ఓపీడీ కవర్‌తో వచ్చే ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా చాలా ఖరీదైనవి, ఇవి ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం కూడా అదేన‌ని నిపుణులు చెప్తున్నారు. ఈ పాలసీల ప్రీమియంలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఆసుపత్రిలో చేరడం కంటే క్లెయిమ్‌ల సంభావ్యత ఎక్కువగా ఉంటుంది, దాంతో పాటు మోసం జ‌రిగే అవ‌కాశం కూడా చాలా ఎక్కువ.

ఓపీడీ కవర్ ప్రీమియంలను నియంత్రణలో ఉంచగల ఏకైక మార్గం, ఓపీడీ ఖర్చులకు నెట్‌వర్క్ ప్రొవైడర్లను కలిగి ఉండటమేనని, అయితే ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా సాధించడం అంత సులభం కానందున, ఈ పాల‌సీలు అధిక ప్రీమియంతో వస్తాయని సిక్దార్ అన్నారు.

అయితే మీరు ఓపీడీ కవర్‌తో పాలసీని కలిగి ఉన్నప్పటికీ, పూర్తి వ్యాక్సిన్ ఖర్చును పొందే అవకాశాలు లేవు, ఎందుకంటే దీనికి ఉప‌ప‌రిమితులు ఉండ‌వ‌చ్చు. ఉదాహరణకు, టీకాకు రూ. 1,200 ఖర్చవుతుంది, ఓపీడీ కవర్‌లోని వ్యాక్సిన్ల ఉప పరిమితి రూ. 800 అయితే, మీరు సొంతంగా రూ.400 ను భరించాలి.

అయితే టీకా వ్య‌యాలు చెల్లిస్తుంద‌న్న ఒక్క కార‌ణంతో ఓపీడీ కవర్ ఉన్న పాలసీలనే త‌ప్ప‌నిస‌రిగా కొనాలనుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. ఎందుకంటే ఓపీడీ కోసం ప్ర‌త్యేక పాల‌సీలు ఇక్క‌డ లేవు. దాంతో పాటు ఇత‌ర విష‌యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం కూడా చాలా ఎక్కువ అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే చాలా ఇటువంటి ఖ‌ర్చుల‌ను స్వ‌యంగా చెల్లించ‌డానికి మొగ్గుచూపుతారు.

ఇందులో ప్రీమియం ఎక్కువ ఎందుకంటే బీమా సంస్థ మీరు ప్రతి సంవత్సరం కొన్ని రకాల ఓపీడీ సేవలను ఉపయోగించుకుంటారని భావిస్తుంది. దీనికి చాలా అవకాశం కూడా ఉంది. పాల‌సీ తీసుకునేట‌ప్పుడు చెకప్‌ ఇతర ప్రయోజనాలపై డిస్కౌంట్లను అందించే ఓపీడీ ప్రణాళికల కోసం చూడటం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని