Purandeswari: తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారు: పురందేశ్వరి

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 26 Aug 2023 11:12 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి నియామకాలపై ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తితిదే బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు. బోర్డు సభ్యులుగా శరత్‌ చంద్రారెడ్డి, కేతన్‌ దేశాయ్‌ నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. దిల్లీ మద్యం స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎంసీఐ స్కామ్‌లో దోషిగా తేలి కేతన్‌ దేశాయ్‌ పదవి కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ విధానాన్ని భాజపా ఖండిస్తోందని పురందేశ్వరి తెలిపారు.

కళంకితులకు పదవులా?: లంకా దినకర్‌

తితిదే పాలకమండలి సభ్యుల నియామకాల్లో సామాజిక సమతుల్యత దెబ్బతిందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తిరుమల శ్రీవారి సేవ కన్నా.. తన సొంతవారి సేవ ప్రాధాన్యం అయిందని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడం రాష్ట్ర ప్రభుత్వానికి నిత్యకృత్యం అయిందని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో నిందితుడు శరత్‌ చంద్రారెడ్డికి, అనేక మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులకు పదవులను కట్టబెట్టారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని