వ్యాక్సిన్లకు అనుమతిపై కాంగ్రెస్‌ భిన్న వాదనలు

కొవిడ్‌ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి  ఔషధ నియంత్రణ సంస్థ ( డీసీజీఐ) అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్‌ భిన్న వాదనలు వినిపిస్తోంది. ఓవైపు ఆ పార్టీ ప్రధాన అధికార,,,

Published : 03 Jan 2021 18:26 IST

దిల్లీ: కొవిడ్‌ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి  ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్‌ భిన్న వాదనలు వినిపిస్తోంది. ఓవైపు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా టీకాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను ప్రశంసిస్తుండగా.. ఆ పార్టీలోని కొందరు నేతలు మాత్రం వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌, శశిథరూర్‌ తదితర నేతలు డీసీజీఐ టీకాలను అనుమతి ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. మూడో విడత ప్రయోగాల ఫలితాలు తేలకముందే టీకాల వినియోగానికి ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిపుణుల కమిటీ సూచన మేరకు అత్యవసర వినియోగ అనుమతులకు డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏ దేశంలోనూ మూడో విడత ప్రయోగాలు పూర్తి కాకుండా అత్యవసర వినియోగానికి కూడా వ్యాక్సిన్‌ను అనుమతించలేదని ఆనంద్‌ శర్మ అన్నారు. ఇంత ఆదరాబాదరాగా అనుమతులు ఇవ్వడంపై కేంద్ర ఆరోగ్యశాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలుత ఈ వ్యాక్సిన్‌ ఇస్తామంటున్నారని, వారి ఆరోగ్యానికి భరోసా ఎవరు?అని ఆయన ప్రశ్నించారు. ప్రయోగాలు పూర్తికాక ముందే  వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులివ్వడం మంచి పద్ధతి కాదని, ప్రజల ఆరోగ్యానికే అది ముప్పుగా మారుతుందని మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. ప్రస్తుతానికి ఆస్ట్రాజెనెకాతో ముందుకెళ్లవచ్చని, మూడో విడత ప్రయోగాలు పూర్తయిన తర్వాతే కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని ఆయన అన్నారు.

మూడో విడత ప్రయోగాలపై అంతర్జాతీయంగా నిబంధనలేమైనా మార్చారా? అని మరో కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతల విమర్శలను కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ కొట్టి పారేశారు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సైనికుల త్యాగాలను కూడా ప్రశ్నించారని, ఇప్పుడు వ్యాక్సిన్‌ విషయంలోనూ రాజకీయాలకు పోతున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి

కొవాగ్జిన్‌‌ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి!

వ్యాక్సిన్‌ అనుమతిపై WHO ఏమందంటే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని