icon icon icon
icon icon icon

డీఎంకేకు గట్టి పోటీ

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల గట్టి పోటీయే ఎదురవుతోంది. గెలుపు కోసం ఆ పార్టీ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated : 16 Apr 2024 17:17 IST

 కొన్ని స్థానాల్లో తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి
గత్యంతరంలేక పలుచోట్ల అభ్యర్థుల మార్పు

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల గట్టి పోటీయే ఎదురవుతోంది. గెలుపు కోసం ఆ పార్టీ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. పొత్తులో భాగంగా 17 స్థానాల్ని మిత్రపక్షాలకు ఇచ్చిన డీఎంకే.. 22 స్థానాల్లో బరిలో ఉంది. 2019లో  మిత్రపక్ష అభ్యర్థుల్ని కలుపుకొని డీఎంకే ఉదయించే సూర్యుడి గుర్తుతో 23 స్థానాల్లో పోటీ చేసి అన్నిచోట్లా విజయఢంకా మోగించింది. ఇంతటి విజయం దక్కినా ఈసారి స్థానిక సమీకరణాల నేపథ్యంలో కొన్నింట ప్రయోగాలు చేసింది. డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా 10 నియోజకవర్గాల్లో తలపడుతుండగా.. డీఎంకే, అన్నాడీఎంకేలు 20చోట్ల నేరుగా బరిలో ఉన్నాయి.


కోయంబత్తూరు కీలకం

వామపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గం.. కోయంబత్తూరు. 2009, 2019లో రెండు సార్లు ఇక్కడ సీపీఎం గెలిచింది. 2014లో అన్నాడీఎంకే కైవసం చేసుకుంది. మూడు సార్లూ తక్కువ మెజారిటీలతోనే అభ్యర్థులు గెలిచారు. ఇలాంటిచోట వామపక్షాల్ని పక్కనపెట్టి సీటు తీసుకున్న డీఎంకే నేరుగా బరిలోకి దిగింది. గతంలో అన్నాడీఎంకేలో ఉండి కోయంబత్తూరు మేయరుగా చేసిన గణపతి రాజ్‌ కుమార్‌ను ఇక్కడ పోటీకి దింపింది. మరోవైపు ఈ స్థానంపై అన్నాడీఎంకే, భాజపాలు కన్నేశాయి. భాజపా నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో ఉన్నారు. కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షో నిర్వహించి అక్కడ బలాన్ని చూసిన తర్వాతే అన్నామలైకి టికెట్‌ కేటాయించారు. అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఐటీ విభాగాధిపతి సింగై జి.రామచంద్రన్‌ బరిలో ఉన్నారు.


ధర్మపురి పోరాటం

అత్యంత కీలకమైన ధర్మపురిలో సిటింగ్‌ ఎంపీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌ 2019లో 70,753 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి డీఎంకే ఆయనను తప్పించి ఎ.మణిని రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలో పాట్టాళి మక్కల్‌ కట్చి (పీఎంకే) ప్రాబల్యం అధికం. 2014లో ఆ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రెండు ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే ఆయా పార్టీలు దక్కించుకున్నాయి. ఈసారి భాజపా తోడుగా పీఎంకే తన బలాన్ని నిరూపించుంచేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌ తన సతీమణి సౌమ్యా అన్బుమణిని బరిలో ఉంచారు. ఈ రెండు పార్టీల మధ్యే అసలైన పోరు ఉండనుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్‌.అశోకన్‌ పోటీ చేస్తున్నారు.


పెరంబలూరులో హోరాహోరీ

2019 ఎన్నికల్లో డీఎంకే గుర్తుతో గెలిచిన ఐజేకే వ్యవస్థాపకుడు టీఆర్‌ పారివేందర్‌ ఇప్పుడు ఆ పార్టీకి టాటా చెప్పేశారు. ఎన్డీయే కూటమికి వెళ్లి కమలం గుర్తుపై అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇది డీఎంకేకు పెద్ద సవాలుగా నిలిచింది. పారివేందర్‌ను ఎదుర్కొనేందుకు డీఎంకే మరో ఎత్తుగడ వేసింది. రాష్ట్ర మంత్రి కె.ఎన్‌.నెహ్రూ కుమారుడు కె.ఎన్‌.అరుణ్‌ నెహ్రూను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో పారివేందర్‌ 4,03,518 ఓట్ల భారీ మెజారిటీతో లోక్‌సభకు వెళ్లారు. ఆయన ఇప్పుడు తమ చెంత ఉండటంతో విజయం ఖాయమని భాజపా భావిస్తోంది. 2009లో డీఎంకే, 2014లో అన్నాడీఎంకే ఇక్కడ విజయం సాధించాయి. ఈ స్థానంలో గెలుపు ఎవరికీ అంత ఆషామాషీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నాడీఎంకే నుంచి ఎన్‌డీ చంద్రమోహన్‌ బరిలో ఉన్నారు.


కళ్లకురిచ్చి.. కదనరంగమే

మంత్రి పొన్ముడి కుమారుడు గౌతమ్‌ సిగామణి పొన్ముడి ఇక్కడ సిటింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈడీ మనీలాండరింగ్‌ కేసు పెట్టింది. ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను డీఎంకే తప్పించింది. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో 3,99,919 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆరోపణల నేపథ్యంలో ఓటమి తప్పదనే ఆందోళనతో ఈ స్థానానికి స్థానికంగా వ్యాపారంలో పేరొందిన కొత్త అభ్యర్థి మలయరసన్‌ను డీఎంకే నిలిపింది. డీఎంకేకు దీటుగా అన్నాడీఎంకే.. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్‌.కుమార గురును పోటీకి పెట్టింది. ఎన్డీయే అభ్యర్థిగా పీఎంకే నుంచి దేవదాస్‌ వడయార్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


నీలగిరి.. నువ్వా నేనా

వివాదాస్పద సిటింగ్‌ ఎంపీ ఎ.రాజాపై డీఎంకే ఆశలు పెట్టుకుంది. 3 పర్యాయాలుగా నీలగిరి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి రాజానే పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో 86,021 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఈయన.. 2014లో ఘోరంగా ఓడిపోయారు. అన్నాడీఎంకే అభ్యర్థి సి.గోపాలకృష్ణన్‌ విజయం సాధించారు. 2019లో సమీకరణాలు మారడంతో గెలుపు రాజాను వరించింది. 2,05,823 మెజారిటీ సాధించారు. ఈసారి విజయం అంత సులువు కాదని పరిస్థితులు చెబుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ను భాజపా బరిలో దించింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో దాన్నుంచి లాభం పొందాలని ఆ పార్టీ చూస్తోంది. లోకేష్‌ తమిళ సెల్వన్‌ను అన్నాడీఎంకే పోటీలో పెట్టింది.


దక్షిణ న‘గరం’..

చెన్నైలో ఇప్పుడు అందరి దృష్టి దక్షిణ చెన్నై నియోజకవర్గంపై ఉంది. గవర్నర్‌గా రాజీనామా చేసి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ సిటింగ్‌ ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. గత 3 ఎన్నికలను చూస్తే.. 2009, 2014లో అన్నాడీఎంకే మంచి మెజారిటీతో గెలిచింది. గత ఎన్నికల్లో డీఎంకేదే పైచేయి అయింది. తమిళచ్చికి 2,62,223 ఓట్ల మెజారిటీ వచ్చింది. అనూహ్యంగా భాజపా తన అభ్యర్థిగా తమిళిసైని తీసుకురావడంతో డీఎంకేకు గట్టి పోటీ ఎదురవుతోంది. నియోజకవర్గంలో బలంగా ఉన్న అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి జయకుమార్‌ కుమారుడు జె.జయవర్ధన్‌ పోటీలో ఉన్నారు.


సేలంలో సిగపట్లు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సొంత జిల్లా.. సేలం. 2009, 2014 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థినే ప్రజలు గెలిపించారు. ఇలాంటి స్థానంలో డీఎంకే అభ్యర్థి ఎస్‌ఆర్‌ పార్తిబన్‌ గత ఎన్నికల్లో 1,46,926 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పళనిసామి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి పి.విఘ్నేష్‌ను బరిలోకి దించారు. సమీకరణాలు మారుతుండటంతో డీఎంకే కొత్త అభ్యర్థి టి.ఎం.సెల్వ గణపతిని దించింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చేశారు. సెల్వ గణపతికి కలర్‌ టీవీ స్కాం, ప్లెజెంట్ స్టే హోటల్‌ కేసుల్లో శిక్ష పడినా 2000, 2001లో హైకోర్టు రద్దు చేసింది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 2014లో ఆర్థిక కుంభకోణాల కేసులో శిక్షపడి పార్లమెంటు నుంచి అనర్హత వేటుపడ్డ తొలి తమిళనాడు ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. ఈ స్థానంలో ఆయనకు మంచి పట్టుందనే ఆలోచన డీఎంకేను ఆకర్షించింది.

 ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img