జగన్‌పై దాడి ఆత్మల పనే!

సీఎం జగన్‌ కంటి దెబ్బకు కారణం మనుషులు కాదని, అది ఆత్మల పనేనని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంపై దాడికి సంబంధించి సమాచారమిచ్చిన వారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తామని విజయవాడ సీపీ కాంతి రాణా ప్రకటించారు.

Published : 16 Apr 2024 06:06 IST

తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా
కంటి దెబ్బ మిస్టరీ ఏంటో.. ఆ నాలుగు ఆత్మలకు తెలుసని వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ కంటి దెబ్బకు కారణం మనుషులు కాదని, అది ఆత్మల పనేనని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంపై దాడికి సంబంధించి సమాచారమిచ్చిన వారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తామని విజయవాడ సీపీ కాంతి రాణా ప్రకటించారు. దీనిపై ఆయనకు ఈ ప్రపంచంలో ఎవరూ సమాచారం చెప్పలేరు. ఎందుకంటే అది ఆత్మలు చేసిన దాడి కాబట్టి’ అని సోమవారం రాత్రి విడుదల చేసిన వీడియోలో వ్యాఖ్యానించారు. ‘ఆ ఆత్మలు కనిపించవు. జగన్‌పై ఆత్మల దాడి ఆపాలంటే నిరంతరం బస్సు యాత్ర ముందు ఇద్దరు పూజారులు, ఇద్దరు పాస్టర్లు, ఇద్దరు మౌలానాలతో పూజలు చేయిస్తూ, దేవుని వాక్యం వినిపిస్తూ ముందుకు సాగాలి. కనిపించని ఆత్మలు చేసిన దాడిని ఆపడం డీజీ, ఐజీ ఇంటెలిజెన్స్‌ వల్ల అవుతుందా? వైకాపా నేతలు, పోలీసులు  వెంటనే పూజలు మొదలు పెట్టండి. ఆత్మల దాడిని ఆపండి’ అని సూచించారు. ‘జగన్‌పై దాడికి గ్రానైట్‌ పలక, ఎయిర్‌గన్‌ కారణాలంటూ రకరకాలుగా చెప్పి.. ఇప్పుడు అవి కావంటున్నారు. కంటికి దెబ్బ ఎలా తగిలిందనేది పోలీసులకే అంతుపట్టడం లేదు. దాడికి సంబంధించిన వీడియోను వందసార్లు చూసినా.. రాయి ఎలా వచ్చిందో, దెబ్బ ఎలా తగిలిందో అర్థం కావట్లేదు’ అని వివరించారు.

వేలాది ఆత్మలు చేసిన దాడి

‘జగన్‌పై దాడికి సంబంధించిన సమాచారం నాలుగు ఆత్మలకే తెలుసు. ఆ ఆత్మలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఘోరంగా హత్యకు గురైన వైఎస్‌ వివేకా, పెట్రోలు మంటల్లో కాలిపోయిన పదో తరగతి చదివే అమర్‌నాథ్‌గౌడ్‌, వేధింపులకు గురై ఉరేసుకున్న మైనారిటీ యువతి మిస్బాలవి. ఈ నలుగురితోపాటు వేలాది ఆత్మలు కలిసి జగన్‌పై దాడి చేశాయి’ అని ఆనం వ్యాఖ్యానించారు. ‘సీఎం జగన్‌కు చీమ కుట్టినా, వెంట్రుక తెల్లబడినా తెలుగుదేశం పార్టీ మీదకే నెట్టేస్తారు. అందుకే ఆత్మలకు విజ్ఞప్తి చేస్తున్నా.  మే 13న ఎన్నికలయ్యే వరకు ఆయనపై దాడి ఆపండి. తర్వాత మీ ఇష్టం’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని