INDIA bloc: ఎన్నికల సమయంలో.. ఇండియా కూటమిలో విభేదాలను తోసిపుచ్చలేం: శరద్‌ పవార్‌

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేమని, అయితే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు.

Published : 29 Sep 2023 18:38 IST

ముంబయి: మరికొన్ని నెలల్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)లోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను కొట్టిపారేయలేమని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) అన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వివాదంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు లేవని చెప్పారు.

‘మరికొన్ని నెలల్లో నాలుగైదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు మాకెంతో ముఖ్యం. ఇటువంటి తరుణంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేం. అయితే, కూటమి నుంచి పలువురు తటస్థ నేతలను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి ఎలా తీసుకురావాలో కూటమి చూస్తుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులతో చర్చిస్తా. సంబంధిత రాష్ట్రాల్లో కూటమి పక్షాల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మరో ఎనిమిది, పది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది’ అని శరద్‌ పవార్‌ అన్నారు.

కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్‌ స్పష్టత

ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఓ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేయడం.. అధికార ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగమే. అయితే, కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని