Arvind Kejriwal: కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్‌ స్పష్టత

ప్రతిపక్షాల కూటమి(opposition bloc)లో భాగమైనప్పటికీ.. ఆప్‌(AAP), కాంగ్రెస్(Congress) మధ్య సయోధ్య కనిపించడం లేదు. రెండు పార్టీల మధ్య ఉన్న లుకలుకలు తరచూ ఏదోఒక అంశం ద్వారా బయటకు పొక్కుతూనే ఉన్నాయి. 

Published : 29 Sep 2023 14:06 IST

దిల్లీ: తాము ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి( opposition bloc) విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామని ఆప్‌ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌( Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఇటీవల పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్టు కావడంతో ఆ రెండు పార్టీల మధ్య  విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ స్పందించారు.

‘ప్రతిపక్షాల కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నాం. కూటమికి దూరంగా వేరే దారిలో వెళ్లం. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్‌ పోలీసులు ఒక నేతను అరెస్టు చేశారని విన్నాను. దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు. దీనిపై మీరు పంజాబ్‌ పోలీసులతో మాట్లాడుకోండి. భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రభుత్వం మాత్రం నిబద్ధత కలిగినది. ఆప్‌ ప్రభుత్వం డ్రగ్స్‌ సమస్యను ముగించే లక్ష్యంతో ఉంది. ఈ పోరాటంలో ఎవరినీ విడిచిపెట్టదు’ అని కేజ్రీవాల్( Arvind Kejriwal) స్పష్టం చేశారు. 

‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు (2015)లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను పంజాబ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఫజిల్కాలోని జలాలాబాద్‌ కోర్టు ఆయనకు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ పరిణామాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభివర్ణించింది. ఆ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా నేతృత్వంలోని నేతల బృందం గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి తమ ఎమ్మెల్యే అరెస్టుపై ఫిర్యాదు చేసింది. మరోవైపు.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఖైరా హస్తం ఉన్నందునే ఆయన అరెస్టు జరిగిందని అధికార ఆప్‌ నాయకుడు మాల్‌వీందర్‌ సింగ్‌ కాంగ్‌ అన్నారు.

ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆప్‌, కాంగ్రెస్ మధ్య ఉన్న విభేదాలు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ దిల్లీ (Delhi) పరిధిలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఇదివరకు కాంగ్రెస్‌ (Congress) నేత ఒకరు ప్రకటన చేయడంపై అప్పట్లో ఆప్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేతల స్పందనతో ఆ వివాదం సద్దుమణిగినప్పటికీ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయో..? లేదో.. ? తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని