BS Yediyurappa : భాజపా-జేడీఎస్‌ పొత్తు నిర్ణయం అగ్ర నాయకత్వం చేతుల్లో ఉంది : యడియూరప్ప

భాజపా-జేడీఎస్‌ పొత్తుపై (BJP-JDS) భాజపా అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (BS Yediyurappa) అన్నారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన తేల్చి చెప్పారు. 

Published : 12 Sep 2023 15:35 IST

బెంగళూరు : భాజపా-జేడీఎస్‌ (BJP-JDS) పొత్తుపై ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi), హోంమంత్రి అమిత్‌ షా (amit sha), పార్టీ అగ్రనేతలు కలిసి నిర్ణయం తీసుకుంటారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (BS Yediyurappa) వ్యాఖ్యానించారు. కర్ణాటక (Karnataka) లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో యడియూరప్ప ఈ విధంగా అన్నారు. దిల్లీలో నిర్వహించనున్న ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడి హోదాలో యడియూరప్ప పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ‘దిల్లీ నేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ చర్చించి పొత్తుపై నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక సమాచారం నాకు తెలియదని’ యడియూరప్ప పేర్కొన్నారు. 

నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

భాజపా అగ్రనేతలకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి, వారి సలహాలు స్వీకరించే ప్రయత్నం చేస్తానని యడియూరప్ప చెప్పారు. భాజపా-జేడీఎస్‌ పొత్తు గురించి చర్చిస్తారా అని విలేకరులు అడగ్గా.. అది మోదీ, అమిత్‌ షా చేతుల్లోనే ఉందన్నారు. అగ్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రతిపక్షంలో కొనసాగుతున్న భాజపా-జేడీఎస్‌ కలసి పని చేయాల్సిన అవసరముందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అన్నారు. పొత్తుపై తదుపరి చర్చలు దిల్లీ స్థాయిలో జరిగే అవకాశం ఉన్నందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇరు పార్టీల నాయకులు కలిసి ఒక నిర్ణయానికి వస్తారని ఆయన చెప్పారు. 

నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీలు చేతులు కలుపుతున్నాయంటూ భాజపా-జేడీఎస్‌ పొత్తుపై కాంగ్రెస్‌ వ్యాఖ్యానించడంపై బొమ్మై మండిపడ్డారు. నిస్సహాయ పార్టీలు కాబట్టే ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, ఆప్‌ ఏ ప్రాతిపదికన ఒక్కతాటిపైకి వచ్చాయని నిలదీశారు. వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు అనేక పొత్తులు కుదిరిన సందర్భాలు భారత దేశ రాజకీయ చరిత్రలో ఉన్నాయన్నారు. కర్ణాటకలోని దుష్ట ప్రభుత్వంపై పోరాడేందుకు భాజపా-జేడీఎస్‌ ఒక్కటి కాబోతున్నాయన్నారు.

గతవారం భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పనిచేయాలనే అవగాహనకు వచ్చామన్నారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో 4 చోట్ల జేడీఎస్‌ పోటీ చేస్తుందని వెల్లడించారు. అయితే చర్చలు ఇంకా తుది దశకు చేరుకోలేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత జేడీఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ భాజపా-జేడీఎస్‌ పొత్తుపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని వెల్లడించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని