Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌లో కనీసం 50 శాతం సాధించినా చాలు: అఫ్గాన్‌ బౌలర్‌

ఒక బౌలర్‌గా బుమ్రాని అభినందిస్తున్నా. మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా బౌలింగ్‌ చేస్తాడు అని అఫ్గాన్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ అన్నాడు.​​​​

Published : 14 Nov 2021 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ఫాస్ట్ బౌలరని నిస్సందేహంగా చెప్పొచ్చు. అతడి గణాంకాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎన్నో కఠినమైన మ్యాచ్‌ల్లో పరుగులు రాకుండా కట్టడి చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. అందుకే చాలామంది యువ పేసర్లు బుమ్రాలాగా రాణించాలని కోరుకుంటారు. అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా ఈ కోవకే చెందుతాడు. బుమ్రా బౌలింగ్‌పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ నవీన్‌ ఉల్‌ హక్‌ మాట్లాడాడు. తన కెరీర్‌ మొత్తంలో బుమ్రా బౌలింగ్‌తో పోలిస్తే కనీసం 50 శాతం చేరుకున్నా సంతృప్తి చెందుతానని నవీన్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. మైదానంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా బుమ్రా ప్రశాంతంగా ఉంటాడని ఈ యువ బౌలర్‌ ప్రశంసించాడు.

“ఒక బౌలర్‌గా బుమ్రాని అభినందిస్తున్నా. మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనుకాకుండా బౌలింగ్‌ చేస్తాడు. అతడి నుంచి ఏం నేర్చుకోవాలో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. బుమ్రా బౌలింగ్‌లో నేను కనీసం 50 శాతం సాధించిన సంతోషిస్తా. అతను చాలా అద్భుతమైన బౌలర్‌ ” అని నవీనుల్‌ హక్‌ అన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌, నవీన్ బౌలింగ్ యాక్షన్ దాదాపు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో నవీన్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బుమ్రాను చూసి ఆ బౌలింగ్‌ యాక్షన్‌ని కాపీ కొట్టాడని చాలామంది భావిస్తున్నప్పటికీ ఇది యాదృచ్చికంగా జరిగిందని నవీనుల్‌ హక్ చెప్పాడు.

‘‘నేను జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నానని నాకు కూడా తెలియదు. ఈ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఎవరూ ఈ విషయాన్ని ఎత్తి చూపలేదు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు పెద్ద స్క్రీన్‌పై నా బౌలింగ్ యాక్షన్‌ని బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌తో పోల్చడం చూశా. అప్పుడు ఆశ్చర్యానికి గురయ్యా. మ్యాచ్‌ ముగిసిన అనంతరం దాని గురించి నన్ను అడగడం ప్రారంభించారు. బౌలింగ్‌ యాక్షన్‌ సహజంగా వస్తుందని నేను భావిస్తున్నా. ఇద్దరి బౌలింగ్‌ యాక్షన్‌ ఒకేలా ఉండడం యాదృచ్చికంగా జరిగిందే” అని ఈ యువ బౌలర్‌ చెప్పుకొచ్చాడు.  

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని