Paris Olympics: ఒలింపిక్‌ విలేజ్‌లో 3లక్షల కండోమ్‌లు..!

వివిధ దేశాలకు చెందిన దాదాపు 14,250 మంది క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్‌ విలేజ్‌’ సిద్ధమవుతోంది.

Published : 19 Mar 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు (Paris 2024 Olympics) ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన దాదాపు 14,250 మంది క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్‌ విలేజ్‌’లో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘సాన్నిహిత్యం’పై (Intimacy) నిషేధం ఎత్తివేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ బస చేసే క్రీడాకారుల కోసం దాదాపు 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

‘క్రీడాకారులు ఉత్సాహంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం అథ్లెట్స్‌ కమిషన్‌తో పనిచేస్తున్నాం. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యంపై నిషేధాన్ని తొలగిస్తున్నాం. ఇక్కడ బస చేసే 14వేలకుపైగా క్రీడాకారుల కోసం దాదాపు 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచుతాం’ ఒలింపిక్‌ విలేజ్‌ డైరెక్టర్‌ లారెంట్‌ మిచాడ్‌ పేర్కొన్నారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రీడా గ్రామంలో కండోమ్‌లను ఉంచడమనేది వాడకం కోసం కాదని, క్రీడాకారులు వీటిని తమ దేశాలకు తీసుకెళ్లి హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకేనని అన్నారు.

Paris Olympics: 10,500 మంది క్రీడాకారులు.. పడవలపై పరేడ్‌..!

ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11వరకు పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 టోక్యో ఓలింపిక్స్‌ (Tokyo Olympics) సమయంలో ‘సాన్నిహిత్యం’గా ఉండటంపై నిషేధం విధించారు. శృంగారంతో సహా భౌతికంగా పరస్పరం దూరంగా ఉండాలని క్రీడాకారులకు సూచించారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను ఒకరినొకరు కనీసం ఆరున్నర అడుగుల దూరాన్ని పాటించాలని అన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ విజృంభణ తగ్గిపోవడంతో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ ఆంక్షలను ఎత్తివేశారు.

హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో కండోమ్‌లను అందుబాటులో ఉంచడం సియోల్‌ ఒలింపిక్స్‌-1988 నుంచి కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యంపై నిషేధం విధించినప్పటికీ దాదాపు లక్షన్నర కండోమ్‌లను అందుబాటులో ఉంచారు. తాజాగా కొవిడ్‌ ప్రభావం లేకపోవడంతో భౌతిక దూరంపై ఉన్న ఆంక్షలన్నీ తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని