పంజాబ్‌కు చావోరేవో..! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో భాగంగా 31వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు, రాహుల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ తలపడనున్నాయి. సమష్టిగా పోరాడుతూ ప్లేఆఫ్‌ రేసులో బెంగళూరు దూసుకెళుతోంది. మరోవైపు పంజాబ్‌ మాత్రం పాయింట్ల

Updated : 15 Oct 2020 15:44 IST

నేడు బెంగళూరుతో పంజాబ్‌ ఢీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో భాగంగా 31వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు, రాహుల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ తలపడనున్నాయి. సమష్టిగా పోరాడుతూ ప్లేఆఫ్‌ రేసులో బెంగళూరు దూసుకెళుతోంది. మరోవైపు పంజాబ్‌ మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో అన్నింటా గెలిచి తీరాల్సిందే. ఈ రోజు రాత్రి షార్జా వేదికగా రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం..

పంజాబ్‌ గేల్‌ మంత్రం ఫలిస్తుందా..?

పంజాబ్‌కు ఈ సీజన్‌ ఇప్పటి వరకూ ఒకెత్తు.. అయితే.. ఇక నుంచి మరో ఎత్తు. ఎందుకంటే ఆ జట్టు ఆడిన 7 మ్యాచుల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించింది. ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ రాహుల్‌ సేన విజయం సాధించి తీరాలి. మరి బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తడబడుతున్న ఆ జట్టు బెంగళూరును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో తమ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ను రంగంలోకి దించాలని పంజాబ్‌ భావిస్తోంది. అతను అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. జట్టులో బౌలింగ్‌ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాటింగ్‌లోనూ ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మినహా ఎవరూ రాణించడం లేదు. పంజాబ్‌ను మిడిల్‌ ఆర్డర్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బౌలర్లు చెప్పుకోదగ్గ గణాంకాలు నమోదు చేయడం లేదు. ఈ మ్యాచ్‌లో గేల్‌ తన ట్రేడ్‌ మార్కు షాట్లతో విరుచుకుపడి భారీ స్కోరు సాధిస్తే పంజాబ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. రాహుల్‌ సేనకు గెలుపు అవకాశాలు సైతం మెరుగుపడతాయి. మరి పంజాబ్‌ గేల్‌ మంత్రం పనిచేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

బెంగళూరులో మునుపెన్నడూ లేనంత జోష్‌..

అవును, కోహ్లీసేన ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఎంతో లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఆ జట్టును ఇన్నాళ్లు బౌలింగ్‌ సమస్య వేధిస్తోంది. అయితే, ఇప్పుడు ఆ సమస్య లేదు. క్రిస్‌ మోరిస్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో యువ ఓపెనర్‌ దేవదత్ పడిక్కల్ నమ్మదగిన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్, కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌.. ఇలా బ్యాటింగ్‌కు కొదవలేదు. ఈ మ్యాచ్‌కు దాదాపు పాత జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరును పంజాబ్‌ భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది.

రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో పంజాబ్‌ 13 మ్యాచుల్లో విజయం సాధించింది. బెంగళూరు 12 విజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 

జట్లు(అంచనా):

పంజాబ్: క్రిస్‌ గేల్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, నికోలస్‌ పూరన్‌, మ్యాక్స్‌వెల్‌, మన్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌, మహమ్మద్‌ షమి, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

బెంగళూరు: దేవదత్​ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, శివం దూబె, క్రిస్‌ మోరిస్‌, ఇసురు ఉదాన, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని, మహమ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని