ధోనీకి అదే కరెక్ట్‌.. హస్సీ ఏమన్నాడు?

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఆడుతుంటే ఆ ధైర్యమే వేరు. అతడు భారత జట్టులో కొనసాగుతున్నా, ఐపీఎల్‌లో సీఎస్కేకు ఆడుతున్నా...

Published : 16 Aug 2020 00:43 IST

అయితే, మధ్యలో ఆటగాళ్లు సహకరించాలి..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఆడుతుంటే ఆ ధైర్యమే వేరు. అతడు భారత జట్టులో కొనసాగుతున్నా, ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ఆడుతున్నా.. తన వికెట్‌ పడేదాకా ప్రత్యర్థి జట్టును ఓటమి భయం వెంటాతుంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అతడు మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ క్లిష్ట సమయాల్లోనూ గొప్పగా పోరాడి అద్భుత విజయాలు అందించాడు. అలాంటి బ్యాట్స్‌మన్‌.. మరీ ఐదు, ఆరు స్థానాల్లో కాకుండా నాలుగో స్థానంలో ఆడాలని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ అభిప్రాయపడ్డాడు. అతడికి ఆ స్థానమే సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన హస్సీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘ధోనీ బ్యాటింగ్‌ చేయడానికి నాలుగో స్థానమే సరిపోతుంది. కానీ, మిడిల్‌ ఆర్డర్‌లోని ప్రతీ ఒక్కరూ పరిస్థితులకు తగ్గట్టు అలవాటు చేసుకోవాలి. ఈ ప్రయోగం ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు ప్రిపరేషన్‌ మీదే ధ్యాస పెట్టాలి’ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌‌ వ్యాఖ్యానించాడు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్ ఎంతో అదృష్టవంతమైన జట్టని, తమకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. అనంతరం ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యే విషయంపై స్పందిస్తూ.. చెన్నై ఆటగాళ్ల ఎలా సన్నద్ధమవ్వాలి, అక్కడ ఎలా ఆడాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పాడు. ఇదిలా ఉండగా, వచ్చేనెల 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిర్వహించనున్న తెలిసిందే. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లకు నేటి నుంచి చెపాక్‌ స్టేడియంలో ప్రత్యేక ఫిట్‌నెస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఇది 20న ముగుస్తుండగా, 21న అక్కడి నుంచే ఆ జట్టు మొత్తం దుబాయ్‌కి బయలుదేరనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని