ఏబీ ఎప్పుడొస్తాడంటే..?

ఐపీఎల్‌-2020లో ఆడేందుకు వచ్చే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దుబాయ్‌లో క్వారంటైన్‌ ఉండదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఛైర్మన్‌ సంజీవ్‌ చూరివాలా అన్నారు. ద్వైపాక్షిక సిరీసులో భాగంగా ఆరోన్ ఫించ్‌, మొయిన్‌ అలీ అప్పటికే నియంత్రిత బయో బుడగలో ఉంటారన్నారు. స్టార్‌ బ్యాట్స్‌మన్‌...

Published : 21 Aug 2020 02:28 IST

వారికి క్వారంటైన్‌ అవసరం లేదన్న ఆర్‌సీబీ ఛైర్మన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2020లో ఆడేందుకు వచ్చే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దుబాయ్‌లో క్వారంటైన్‌ ఉండదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఛైర్మన్‌ సంజీవ్‌ చూరివాలా అన్నారు. ద్వైపాక్షిక సిరీసులో భాగంగా ఆరోన్ ఫించ్‌, మొయిన్‌ అలీ అప్పటికే నియంత్రిత బయో బుడగలో ఉంటారన్నారు. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, పేసర్‌ డేల్‌ స్టెయిన్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ ఎప్పుడొస్తారో ఆయన వెల్లడించారు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో ఆయన మాట్లాడారు.

కరోనా వైరస్‌ ముప్పుతో ఈ సారి ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు టోర్నీ జరుగుతుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్‌కు వెళ్లారు. నెల రోజులు ముందుగానే చేరుకుంటే అక్కడి వాతావరణం, పిచ్‌లపై అవగాహన వస్తుంది. అలాగే బయో బుడగలో ఉండటం అలవాటు అవుతుంది.

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్‌4 నుంచి 16 వరకు పరిమిత ఓవర్ల మ్యాచులు జరుగుతాయి. ఆ సిరీసులో పాల్గొన్న ఇంగ్లిష్‌, ఆసీస్‌ ఆటగాళ్లు సెప్టెంబర్ ‌17న దుబాయ్‌కు వస్తారని సంజీవ్‌ తెలిపారు. ప్రతి ఆటగాడు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ వారంతా అప్పటికే నియంత్రిత వాతావరణలో ఉంటారు కాబట్టి క్వారంటైన్‌ అవసరం లేదన్నారు. టెస్టులు చేయించుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అంతా బాగుంటే వారూ ఆరంభ మ్యాచులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆగస్టు 22న దుబాయ్‌లో జట్టుతో కలుస్తారని సంజీవ్‌ అన్నారు. శ్రీలంక క్రికెటర్లు సెప్టెంబర్‌ 1న వస్తారని వివరించారు. దక్షిణాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌మోరిస్‌, డేల్‌ స్టెయిన్‌ వస్తారన్న సంగతి తెలిసిందే. ఇక మొత్తం టోర్నీకి ఆటగాళ్లంతా దుబాయ్‌లోని వాల్డార్ఫ్‌ హోటళ్లో బస చేస్తారని సంజీవ్‌ తెలిపారు. దుబాయ్‌, అబుదాబి, షార్జా స్టేడియాలకు సులువుగా చేరుకొనేలా బసకు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 155 గదులు బుక్‌ చేశామని అన్ని వసతులు ఉంటాయని వెల్లడించారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఎక్కువ మంది రావడం లేదని, వచ్చిన వారూ కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని