England: అంచనాలు తలకిందులు.. ఇక ఇంగ్లాండ్‌కు ప్రతి మ్యాచ్‌ చావోరేవో

భారత గడ్డపై ప్రపంచకప్‌ ఆరంభమవుతుంటే.. మన జట్టును కాదని, ఇంగ్లాండ్‌ (England) ను టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొన్నాడు దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌. ఆయనే కాదు.. చాలామంది మాజీలు, విశ్లేషకులు ఇంగ్లిష్‌ జట్టుకే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ అన్నారు.

Published : 16 Oct 2023 10:43 IST

భారత గడ్డపై ప్రపంచకప్‌ ఆరంభమవుతుంటే.. మన జట్టును కాదని, ఇంగ్లాండ్‌ (England) ను టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొన్నాడు దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌. ఆయనే కాదు.. చాలామంది మాజీలు, విశ్లేషకులు ఇంగ్లిష్‌ జట్టుకే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ అన్నారు. 2019లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి వన్డే ప్రపంచకప్‌ను దక్కించుకున్న ఇంగ్లాండ్‌.. ఆ తర్వాత కూడా దూకుడును కొనసాగిస్తోంది. ఈసారి బలమైన జట్టుతో, భారీ అంచనాలతో టోర్నీలో అడుగు పెట్టిన బట్లర్‌ సేన.. ఇప్పుడిలాంటి స్థితిలో నిలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (New Zealand)చేతిలో చిత్తయితే, ఆ రోజు కలిసి రాలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అఫ్గాన్‌ (Afghanistan) లాంటి చిన్న జట్టు చేతిలో ఓడటంతో ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ అవకాశాలు బాగా సంక్లిష్టమైనట్లే. ఆడింది మూడు మ్యాచ్‌లే కదా అనుకోవచ్చు. కానీ సెమీస్‌ బెర్తుల కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఓ చిన్న జట్టు చేతిలో ఓడితే.. పుంజుకుని రేసులో ముందంజ వేయడం అంత తేలిక కాదు. 

రెండు ఓటములూ భారీ తేడాతో కావడం ఆ జట్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేసేదే. ఇక ఆ జట్టుకు ప్రతి మ్యాచ్‌ చావోరేవో అన్నట్లే. దూకుడుగా ఆడి ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఇంగ్లాండ్‌.. అఫ్గాన్‌ చేతిలో ఓటమితో ఆత్మరక్షణలో పడుతుందనడంలో సందేహం లేదు. అఫ్గాన్‌కు అదృష్టం కలిసొచ్చి గెలిచిందనుకోవడానికి కూడా లేదు. ఆ జట్టు సాధికారిక ఆటతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇది బట్లర్‌ సేన ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే మరో ఫేవరెట్‌ ఆస్ట్రేలియా సెమీస్‌ రేసులో వెనుకబడగా.. ఇప్పుడు ఇంగ్లాండ్‌ మరింత ఇబ్బందికర స్థితికి చేరుకుంది. ఈ పరిణామాలు సెమీస్‌ రేసును రసవత్తరంగా మారుస్తాయనడంలో సందేహం లేదు. ఈసారి ఎవరు ముందంజ వేస్తారో చివరి వరకు తేలకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని