AFG vs SL: అఫ్గానిస్థాన్‌ మరో సంచలనం.. శ్రీలంకపై ఘన విజయం

ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మరో సంచలన విజయం సాధించింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Updated : 30 Oct 2023 22:02 IST

పుణె: ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan) మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌.. తాజాగా తనకంటే బలమైన శ్రీలంక (Sri Lanka)ను ఓడించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంకపై అఫ్గానిస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 241 పరుగులకు కట్టడి చేసిన అఫ్గాన్‌.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 242 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి ఛేదించింది. రహమత్ షా (62; 74 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58*; 74 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా (73*; 63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదడంతో సునాయసంగా విజయం సాధించింది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (0) విఫలం కాగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం (39; 57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2, కాసున్ రజిత ఒక వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (46; 60 బంతుల్లో 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) పరుగులకే వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3 ఫోర్లు), సదీర సమరవిక్రమార్క (36; 40 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఎంజొలో మాథ్యూస్‌ (23; 26 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. టెయిలెండర్ మహీశ్ తీక్షణ (29; 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని