Published : 26 Jan 2021 17:54 IST

దాదా కాల్ చేశాడు..క్రెడిట్‌ ద్రవిడ్‌కే: రహానె

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలిన అనంతరం తనకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నుంచి కాల్‌ వచ్చిందని వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె తెలిపాడు. కాల్‌లో దాదా స్ఫూర్తినిస్తూ మాట్లాడాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు రహానె సారథిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

‘‘అడిలైడ్‌ టెస్టు ముగిసిన అనంతరం దాదా నాకు కాల్ చేశాడు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాడు. వ్యక్తిగా, జట్టుగా నమ్ముతూ పోరాడాలని సూచించాడు’’ అని రహానె తెలిపాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోరఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. అయితే కోహ్లీ గైర్హాజరీతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా యువ ఆటగాళ్ల అద్భుత పోరాటంతో సిరీస్‌ను భారత్‌ 2-1తో సాధించింది.

కాగా, యువఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడంలో ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్, ఐపీఎల్‌ పాత్ర ఎంతో ఉందని రహానె అన్నాడు. భయంలేని క్రికెట్‌ ఆడటానికి ఐపీఎల్‌ దోహదపడిందని చెప్పాడు. అలాగే యువ ఆటగాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిద్దడంలో ద్రవిడ్‌ ప్రధానపాత్ర పోషించాడని కొనియాడాడు. భారత్-ఎ, అండర్‌-19 జట్లకు ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి రహానె మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం. దేశం కోసం పోరాడాలనే ఆలోచిస్తాం. మీ అందరికీ ఓ విషయం చెబుతున్నా.. కోహ్లీ కెప్టెన్, నేను వైస్‌కెప్టెన్‌. కోహ్లీ వెళ్లేముందు ఏం జరిగిందో అనవసరం. అతడు మా సారథి. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌గా నా పాత్రను ఆస్వాదిస్తా’’ అని అన్నాడు. సిడ్నీ టెస్టులో సిరాజ్‌, బుమ్రా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవడాన్ని రహానె తీవ్రంగా ఖండించాడు. ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసేవారిని స్టేడియం నుంచి బయటకు పంపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించాడు.

ఇదీ చదవండి

టీమిండియాను ఆయనే బలంగా తయారుచేశాడు..

ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం.. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని