IND vs ENG 2021: నాలుగో టెస్ట్‌..అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే..!

లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Published : 02 Sep 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె సహా ఛెతేశ్వర్‌ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినా, యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గత రెండు సంవత్సరాలుగా రహానె నిలకడలేమితో సతమతమవుతున్నాడు. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెల్‌బోర్న్‌లో శతకం, లార్డ్స్‌లో అర్ధ శతకం చేసినా.. అతడు మునుపటి ఫామ్‌ను అందుకోలేక పోతున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 19 సగటుతో 95 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

ఇక నాలుగో టెస్టు కోసం జట్టులోకి తీసుకున్న సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఒవల్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దానికి తోడు ఇటీవల అశ్విన్‌ కౌంటీ క్రికెట్లో 6 వికెట్లు తీశాడు. అంతే కాకుండా ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం కూడా భారత్‌కి కలిసొస్తుంది. అయితే, కచ్చితంగా నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనే కోహ్లీ అభిప్రాయం ప్రకారం చూస్తే.. ఇషాంత్‌ శర్మను తప్పించి అతడి స్థానంలో శార్ధుల్‌ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలి. శార్దుల్‌ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటగలడు. అలా చేస్తే జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమిపై భారం తగ్గించవచ్చు.

అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, హనుమ విహారి వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్‌కు కొత్తదనం వస్తుంది. ఒకవేళ రహానెను తప్పిస్తే అతడి స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ హనుమ విహారిని తీసుకునే అవకాశం ఉంది. అయితే, అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ వంటి వారు సూచించినా కోహ్లీ అటువైపు ఆసక్తి చూపడం లేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ విఫలమవుతున్నా.. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుండటమే అందుకు నిదర్శనం. మేటి స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను పక్కన పెట్టి.. మూడు టెస్టుల్లో కలిపి రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాను ఆడించడం విమర్శలకు తావిస్తోంది.

మరోవైపు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సహా ఐదు వందలకు పైగా పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి జోరుకి కళ్లెం వేయాలంటే అశ్విన్‌ లాంటి సీనియర్‌ స్పిన్నర్ల అవసరం ఎంతైనా ఉంది. మరో ఆటగాడు డేవిడ్‌ మలన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో అదరగొడుతున్న మార్క్‌ వుడ్‌, తన స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెడుతున్న క్రిస్‌ వోక్స్‌ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం ఇంగ్లాండ్‌కు సానుకూలాంశం. నాలుగో టెస్టులో జోస్‌ బట్లర్‌ స్థానంలో జానీ బెయిర్‌స్టో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇలా ఏ లెక్కన తీసుకున్నా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ఇంగ్లాండ్‌ అమ్ములపొదిలో కావాల్సినన్ని ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి.

అయితే, లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన వెంటనే లీడ్స్‌లో ఘోర పరాజయం ఎదురుకావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఒవల్‌లో గురువారం నుంచి ప్రారంభం కాబోయే నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. ‘లార్డ్స్‌లో విజయం సాధించినంత మాత్రాన తర్వాతి టెస్టులో కచ్చితంగా గెలుస్తామని చెప్పలేం. అలాగే లీడ్స్‌లో ఓడిపోయినంత మాత్రాన ఒవల్‌లో ఓడిపోతాం అని భావించలేం. బయటి వ్యక్తుల మాటలు పట్టించుకోనవసరం లేదు’ అని భారత సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఒవల్‌లో భారత్‌ పుంజుకుని రాణిస్తుందో.? ఇంగ్లాండ్‌ జోరుకు దాసోహమంటుందో.! వేచి చూడాలి.

జట్ల వివరాలు..
భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌

ఇంగ్లాండ్‌: జో రూట్‌ (కెప్టెన్), మొయిన్‌, అండర్సన్‌, బెయిర్‌ స్టో, బిల్లింగ్స్‌, రోరీ బర్న్స్‌, సామ్‌ కరన్‌, హమీద్‌, డాన్‌ లారెన్స్‌, మలన్, ఓవర్టన్‌, ఓలి పోప్, ఓలి రాబిన్సన్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని