WTC Final: అప్పుడు ఆసీస్‌ చేసిన పొరపాటే.. ఇప్పుడు భారత్‌ చేసింది: స్టీవ్‌ వా

రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ (WTC Final) ఆడుతున్న భారత్‌కు మళ్లీ కలిసిరావడం లేదు. జట్టు ఎంపిక నుంచి ఆటగాళ్ల ఆటతీరు వరకు అన్నింటా విమర్శలు ఎదుర్కొంటోంది. 

Published : 10 Jun 2023 10:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ పట్టుబిగిస్తోంది. ప్రస్తుతం 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 123/4 స్కోరుతో కొనసాగుతోంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.  అంతకుముందు ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. టాస్‌ నెగ్గిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలి రోజు మొదటి సెషన్‌ మినహా ఆసీస్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో 2019 యాషెస్‌ సిరీస్‌లో తమ జట్టు చేసిన పొరపాటును ఇప్పుడు టీమ్‌ఇండియా చేసిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా వ్యాఖ్యానించాడు. ఓవల్‌ వేదికగానే జరిగిన ఆ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్‌ టిమ్ పైన్ టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నాడని.. అయితే, చివరికి ఇంగ్లాండ్‌ 145 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించిందని గుర్తు చేశాడు. అలాగే భారత తుది జట్టు ఎంపికా సరిగా లేదని స్టీవ్‌ వా పేర్కొన్నాడు. 

‘‘నాలుగేళ్ల కిందట యాషెస్‌ సిరీస్‌లో మేం చేసిన మిస్టేక్‌ను ఈసారి భారత్‌ చేసింది. ఓవల్‌ పిచ్‌ ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటుంది. పిచ్‌ పైభాగంలో పచ్చిక ఉన్నట్లు అనిపించినా.. కిందిభాగంలో మాత్రం పొడిగానే ఉంటుంది. దీంతో పచ్చని పిచ్‌తో బరిలోకి దిగుతున్నామనే భ్రమతో ఉంటారు. ఎండ వచ్చేస్తే పరిస్థితి త్వరగా మారిపోతుంది. మరింతగా పొడిబారడంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే, టీమ్‌ఇండియా తుది జట్టును కూడా సరైంది ఎంచుకోలేదనిపించింది. పచ్చికను చూసి పేసర్లను తీసుకుంది. కానీ, స్పిన్‌ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. 

నేను తప్పకుండా అశ్విన్‌ను ఎంపిక చేసేవాడిని. కేవలం అతడు బౌలింగ్‌కు మాత్రమే కాకుండా బ్యాటింగ్‌కూ పనికొస్తాడు. ఇప్పటికే టెస్టుల్లో ఐదు సెంచరీలు చేసిన అతడు తుది జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. డబ్ల్యూటీసీ 2021- 23 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్‌ బౌలర్‌ కూడా అతడే’’ అని స్టీవ్‌ వ్యాఖ్యానించాడు. 

సరైన సన్నద్ధత లేదు: రికీ పాంటింగ్‌

ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆటతీరు నిరాశ కలిగించిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తెలిపాడు.  మరీ ముఖ్యంగా పేసర్లకు సరైన సన్నద్ధత లేదని పేర్కొన్నాడు.‘‘ఇప్పటి వరకు భారత్‌ ఆటతీరు సరిగా లేదు. ఐపీఎల్‌ తర్వాత అతిపెద్ద పోరుకు వచ్చిన బౌలర్లకు సరైన సన్నద్ధత లేదు. ఆసీస్‌ ఆటగాళ్లు కొందరు చాలా రోజుల ముందే ఇంగ్లాండ్‌కు వచ్చారు. అయితే, కొందరు మాత్రం గత మూడు నెలల నుంచి ఏమీ చేయకుండానే బరిలోకి దిగారు. ఇక భారత బ్యాటర్లు ఏమాత్రం ప్రిపేర్‌ అయ్యారో తెలియదు. విరాట్‌ను అడిగితే మంచి ఫామ్‌లో ఉన్నట్లు చెబుతాడు. అలాగే, రహానె కూడా తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఐపీఎల్‌ లేకపోతే రహానెను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసేవారే కాదు.  అందుకే, ఐపీఎల్‌ వల్ల లాభనష్టాలు ఉంటాయి’’ అని పాంటింగ్‌ చెప్పాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు