ODI Worldcup: ఆసీస్‌ ఖాతాలో ఆరో ప్రపంచకప్‌.. ఫైనల్‌లో భారత్‌ పరాజయం

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది.

Updated : 20 Nov 2023 00:05 IST

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో వరుస విజయాలతో ఫైనల్‌ చేరిన భారత్ (Team India).. తుదిపోరులో అభిమానులను నిరాశ పరిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరో సారి కప్‌ను సొంతం చేసుకుంది. హెడ్‌ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో విజృంభించిన వేళ 43 ఓవర్లలోనే 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. లబుషేన్‌ (58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు)  అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటయ్యింది. కోహ్లీ (54; 63 బంతుల్లో 4×4), కేఎల్‌ రాహుల్‌ (66; 107 బంతుల్లో 4×1) అర్ధశతకాలు చేయగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47; 31 బంతుల్లో 4×4, 3×6) ఫర్వాలేదనిపించాడు.  శుభ్‌మన్‌ గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (9), సూర్యకుమార్‌ (18) తీవ్ర నిరాశ పరిచారు. ఇప్పటివరకు భారత్ నాలుగుసార్లు ఫైనల్‌ చేరగా.. రెండుసార్లు (1983, 2011) విజేతగా నిలిచింది. మిగతా రెండుసార్లు (2003, 2023) ఆసీస్ చేతిలోనే పరాజయం పాలైంది. ఆసీస్ ఇప్పటివరకు ఆరుసార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) విశ్వవిజేతగా నిలిచింది.

ప్రారంభంలో గట్టిపోటీ

లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (7)ను మహ్మద్‌ షమీ పెవిలియన్‌కు చేర్చాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అతడు స్లిప్‌లో ఉన్న కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (15) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. బుమ్రా వేసిన 4.3వ బంతికి కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రెండో డౌన్‌లో వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (4)ను కూడా బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ, లబుషేన్‌తో కలిసి ఓపెనర్‌ హెడ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ వైపు లబుషేన్‌ చక్కని సహకారం అందిస్తుంటే.. మరోవైపు ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయాడు. అయితే, విజయానికి 2 పరుగుల దూరంలో హెడ్‌ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌తో కలిసి  లబుషేన్‌ మ్యాచ్‌ను ముగించాడు. భారత్‌ బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ షమీ, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.

ఆరంభంలో మెరిసినా..

తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (4) నిరాశపరిచినా.. అవతలి ఎండ్‌లో ఉన్న రోహిత్‌శర్మ దూకుడుగా ఆడాడు. దీంతో 9 ఓవర్లకే 70 పరుగులు దాటేసింది. దీంతో స్టేడియం అంతా జోష్‌తో నిండిపోయింది. మరోవైపు టీవీలను చూస్తున్న ప్రేక్షకులు ఆనందంలో మునిగి తేలిపోయారు. ఇలాగే ఆడితే స్కోరు 300 దాటడం ఖాయమనుకున్నారు. ఇక్కడి నుంచే ఆసీస్‌ బౌలర్లు నెమ్మదిగా భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. స్వల్ప వ్యవధిలో రోహిత్‌తో పాటు శ్రేయస్‌ను (4) ఔట్ చేశారు. దీంతో పరుగుల వేగం మందగించింది. విరాట్ - కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. దాదాపు 97బంతుల వరకు బౌండరీ రాలేదంటే ఆసీస్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. (icc world cup 2023 final match) వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగులు జోడించారు. విరాట్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో విరాట్‌ను కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడ్డూ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. మరోవైపు క్రీజ్‌లో పాతుకు పోయిన కేఎల్‌ను స్టార్క్‌ బోల్తా కొట్టించాడు. షమీ (6) కూడా బ్యాట్‌ను ఝుళిపించే ప్రయత్నంలో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన బూమ్రా ఒక పరుగుకే ఔట్‌ అవ్వగా, చివరిలో మెరుపులు మెరిపిస్తాడనుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (18) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. చివరిలో కుల్‌ దీప్‌ యాదవ్‌ 10(18) పరుగులు చేసి రనౌట్‌ అవ్వగా, మహ్మద్‌ సిరాజ్‌ 9(8) నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ 3, ప్యాట్ కమిన్స్ 2, జోష్‌ హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్,  ఆడమ్‌ జంపా చెరో వికెట్‌ తీశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని