Test Cricket: బంగ్లాదేశ్ ప్రపంచ రికార్డు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి జట్టుగా

అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) 546 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 

Updated : 17 Jun 2023 15:45 IST

ఇంటర్నెట్ డెస్క్:  టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ప్రపంచ రికార్డు సృష్టించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఏకంగా 546 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 21వ శతాబ్దంలో  టెస్టు క్రికెట్‌ (Test Cricket) చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ 675 పరుగుల తేడాతో (1928లో) విజయం సాధించి అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 562 పరుగుల తేడాతో (1934లో) గెలుపొంది రెండో స్థానంలో ఉంది.

ఇక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌.. నజ్ముల్ హుస్సేన్‌ షాంటో (146) శతకానికితోడు మహ్మదుల్లా హసన్‌ (76), ముష్పీకర్‌ రహీమ్‌ (47), హసన్‌ మిరాజ్‌ (48) రాణించడంతో 382 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్‌ 146 పరుగులకే కుప్పకూలింది. అప్సర్‌ జాజయ్‌ (36) టాప్‌ స్కోరర్‌. తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగుల ఆధిక్యం సంపాందించిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (124) మరోసారి శతకంతో విరుచుకుపడ్డాడు. మోమినుల్ హక్ (121) కూడా సెంచరీ చేయడంతో 425/4 వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే తక్కువ స్కోరుకే చేతులేత్తేసింది. తస్కిన్‌ అహ్మద్‌ (4/37), షారిఫుల్ ఇస్లాం (3/28) చెలరేగడంతో అఫ్గాన్‌ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని