IND vs ENG: టీమ్‌ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్‌ స్టోక్స్

టెస్టుల్లో ఇంగ్లాండ్‌ టీమ్‌ పుంజుకుంది. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తేడాతో ఘన విజయం సాధించింది...

Published : 29 Jun 2022 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టుల్లో ఇంగ్లాండ్‌ టీమ్‌ పుంజుకుంది. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో జులై 1 నుంచి టీమ్‌ఇండియాతో ఆడే కీలక మ్యాచ్‌కు ముందు మంచి ఆత్మవిశ్వాసం సంపాదించుకుంది. అలాగే ఆ జట్టు కీలక ఆటగాళ్లు జోరూట్‌, బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ సిరీస్‌ అనంతరం ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తాము ఎలా ఆడామో టీమ్‌ఇండియాతో అదే విధంగా దూకుడుగా ఆడతామని చెప్పాడు. కివీస్‌పై ఏయే విభాగాల్లో రాణించామో వాటిపై మరింత దృష్టిసారిస్తామని చెప్పాడు. దీంతో టీమ్‌ఇండియాపై విజయం సాధిస్తామని స్టోక్స్‌ ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ గత 17 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. దానికితోడు మార్చిలో వెస్టిండీస్‌ పర్యటనలోనూ టెస్టు సిరీస్‌ కోల్పోయింది. దీంతో జోరూట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలోనే బెన్‌స్టోక్స్‌ కొత్త సారథిగా ఎంపికై స్వదేశంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ను చిత్తు చేశాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో సునాయాస విజయాలు సాధించిన ఇంగ్లాండ్‌ మూడో టెస్టులో విజయం కోసం చెమటోడ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 329 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 55కే ఆరు వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది. ఆ సమయంలో బెయిర్‌స్టో (162), ఓవర్టన్‌ (97), బ్రాడ్‌ (42) మెరుపు బ్యాటింగ్‌ చేసి ఇంగ్లాండ్‌కు 360 పరుగుల భారీ స్కోర్‌ అందించారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు గొప్పగా పుంజుకున్నారని, ఇలాంటి పట్టుదలతోనే టీమ్‌ఇండియాతోనూ ఆడతామని స్టోక్స్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని