Updated : 16 Mar 2021 11:08 IST

కత్తిలా మెరిసింది 

చరిత్రలో లేదా సినిమాల్లో కత్తి యుద్ధం గురించి చదవడం.. చూడటమే కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను చూస్తూనే ఉంటాం. రెండు ఊచల్లాంటి కత్తులు పట్టుకుని ఫెన్సర్లు పోరాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది.. శరీరానికి కత్తి తాకితే వారి శిరస్త్రాణం పైనున్న లైటు వెలగడం లాంటివి చాలా కొత్తగా అనిపిస్తాయి. ఐరోపా దేశాలు ఈ క్రీడలో ఆరితేరిపోయాయి. అలాంటిది మన దగ్గరా అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఫెన్సర్‌ ఉందని.. ఆమెను టోక్యోలో ఒలింపిక్స్‌ చూస్తామని ఎవరైనా ఊహించి ఉంటారా? ఒలింపిక్స్‌లో కత్తి తిప్పబోతున్న ఆ ఫెన్సరే భవానీ దేవి. మహిళల వ్యక్తిగత సెబర్‌ విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా నిలిచిన ఈ 27 ఏళ్ల తమిళనాడు అమ్మాయి.. ఈ అవకాశాన్ని అందుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసింది.

తొలి భారత ఫెన్సర్‌గా భవాని

చెన్నెలో పుట్టిన భవాని 2003లో క్రీడల్లో కెరీర్‌ ప్రారంభించింది. ధనుష్‌కొడి పాఠశాల్లో చదువుతున్న సమయంలోనే ఆమెకు ఫెన్సింగ్‌ పరిచయం అయింది. ఈ క్రమంలో కేరళ సాయ్‌ సెంటర్‌లో చోటు దక్కడం ఆమె కెరీర్‌లో మలుపు. 14 ఏళ్లకే తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడిన భవానీ.. 2009 కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌ (మలేసియా), 2010లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ (ఫిలిప్ఫీన్స్‌)లో కాంస్యం గెలవడం ద్వారా వెలుగులోకి వచ్చింది. 2015లో రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలోని గోస్పోర్ట్స్‌ స్పాన్సర్‌షిప్‌ దొరకడం ఆమె కెరీర్‌కు ఊతమిచ్చింది. 2019లో కాన్‌బెర్రాలో జరిగిన సీనియర్‌ కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సీనియర్‌ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా భవాని నిలిచింది. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే సత్తా తనకుందని చాటింది. అదే ఏడాది నాన్న మరణించడం ఆమెను మానసికంగా కుంగదీసినా.. ఒలింపిక్స్‌లో ఆడాలన్న ఆయన కల తీర్చడం కోసం ఈ క్రీడలో కొనసాగింది.

2012 నుంచి ప్రయత్నించి..

ఫెన్సింగ్‌లో ఎనిమిదిసార్లు జాతీయ ఛాంపియన్‌ అయిన భవానికి ఒలింపిక్స్‌లో ఆడాలనేది పెద్ద కల. 2012 నుంచి ఆమె ఈ ప్రయత్నంలోనే ఉంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌తో పాటు 2016 రియో క్రీడల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. ఈసారి టోక్యోలో కూడా భవానీకి అవకాశం దక్కదేమో అనిపించింది. కరోనా మహమ్మారి కారణంగా 2019లో ఫెన్సింగ్‌ ఈవెంట్లన్నీ రద్దు కావడంతో ఈ తమిళనాడు ఫెన్సర్‌ ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఆమె మాత్రం తన ప్రాక్టీస్‌ను ఆపలేదు. ఇటలీ కోచ్‌ జొనాటి శిక్షణలో తప్పులు దిద్దుకుంటూ ముందుకు సాగింది. ఏకంగా అయిదేళ్లుగా ఇటలీలోనే ఉంటూ ఆమె సాధన కొనసాగించింది. హంగేరిలో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా ఉండడంతో భవాని. రోడ్డు మార్గం ద్వారా 10 గంటలు ప్రయాణించి ప్రపంచకప్‌కు వచ్చింది. ర్యాంకింగ్‌లో 45 స్థానంలో నిలవడం ద్వారా ఆసియా ఓసియానియాలో అందుబాటులో ఉన్న రెండు ఒలింపిక్‌ బెర్తుల్లో ఒక దాన్ని సొంతం చేసుకుంది. ‘‘భారత్‌లో ఫెన్సింగ్‌ ప్రాచుర్యంలో లేదు. ఇలాంటి దేశం నుంచి వచ్చిన నేను టోక్యోలో భారత్‌కు ప్రతినిధిగా ఉండాలనుకున్నా. ఒలింపిక్స్‌ బెర్తు కోసం ఏళ్ల తరబడి ప్రయత్నించా. కుటుంబాన్ని విడిచి అయిదేళ్లు ఇటలీలోనే సాధన చేశా. హంగేరి టోర్నీ ద్వారా ఒలింపిక్స్‌కు వెళ్లకపోతే సియోల్‌లో జరిగే ఆఖరి అర్హత పోటీనే మిగిలేది. కానీ ర్యాంకింగ్‌ పాయింట్ల ద్వారా ఒలింపిక్‌ బెర్తు సొంతం చేసుకోవడంతో నా శ్రమకు ఫలితం దక్కింది’’ అని భవాని చెప్పింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని