Arshdeep Singh: భువీ పొదుపుగా బౌలింగ్‌ చేయడం నాకు కలిసొచ్చింది.. : అర్ష్‌దీప్‌

ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడం తనకు సానుకూలంగా మారిందని యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. అప్పుడే ఒత్తిడిలో ఉన్న బ్యాటర్ల వికెట్లను తాను సాధిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Updated : 31 Oct 2022 14:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవర్‌ప్లేలో భువనేశ్వర్‌ కుమార్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడం తనకు కలిసొచ్చి వికెట్లను తీస్తున్నట్లు యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ చెప్పాడు. బ్యాటర్లకు పరుగులు రాకుండా భువీ కట్టడి చేసి ఒత్తిడి సృష్టిస్తే తాను వికెట్లు తీయడం సులువుగా మారుతోందని పేర్కొన్నాడు. ‘‘మేము బ్యాటర్ల బలహీనతలను అధ్యయనం చేస్తాం. నేను, భువీ భాయ్‌ తొలి ఓవర్లలో కొంచెం స్వింగ్‌ చేసి వారిని బీట్‌ చేయడానికి ప్రయత్నిస్తాం. భువీ తొలి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో బ్యాటర్లు ఒత్తిడిలో ఉంటారు.. అప్పుడు నేను దాడి చేయడం సులువుగా మారుతోంది. నా విజయానికి క్రెడిట్‌ అతడికే దక్కుతుంది. అతడి బౌలింగ్‌లో బ్యాటర్లు ఎటువంటి సాహసం చేయరు. వారు నా బౌలింగ్‌లో ప్రయత్నిస్తారు. అందుకే మంచి బౌలింగ్‌ భాగస్వామ్యం ఏర్పాటు చేశాం. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు ఎంత ముఖ్యమో బౌలింగ్‌లో కూడా అంతే కీలకం. తొలి ఓవర్లలోనే వికెట్లు లభిస్తే.. మీకు, మీ జట్టుకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. బౌలింగ్‌కు పెర్త్‌ అద్భుతమైన ట్రాక్‌. నా కెరీర్‌లో బౌలింగ్‌ చేసిన స్పైసియస్ట్‌ ట్రాక్‌ ఇదే’’ అని అర్ష్‌దీప్‌ పేర్కొన్నాడు.

ఈ వికెట్‌పై భారత్‌ 145 పరుగులు చేస్తే విజయం సాధించేది అన్న వాదనను అర్ష్‌దీప్‌ అంగీకరించలేదు. 133 కూడా ఈ ట్రాక్‌పై మంచి లక్ష్యమే అని పేర్కొన్నాడు. అదే సమయం కలిసి రాకపోతే.. 160 కూడా చిన్న లక్ష్యంగానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌లో అర్ష్‌దీప్‌ మూడు మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు 7.83 ఎకానమీతో 7 వికెట్లు తీసుకొన్నాడు. మరోవైపు భువీ ఇప్పటి వరకు టోర్నీలో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టినా.. 4.87 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని