CSK vs KKR: ఈ ఒక్కటి గెలిస్తే.. చెన్నైకి ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం!

ప్రస్తుతం చెన్నై (csk) 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే సీఎస్‌కే 17 పాయింట్లకు చేరుతుంది. దీంతో ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకొనే అవకాశం ఉంది.

Published : 14 May 2023 16:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL 2023) లీగ్‌ స్టేజ్‌లో మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. ప్లేఆఫ్స్‌లో నాలుగు బెర్తుల కోసం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (CSK vs KKR) తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధిస్తే చాలు దాదాపు ప్లే ఆఫ్స్‌లో బెర్తును ఖాయం  చేసుకొనే అవకాశం ఉంది. మరోవైపు కోల్‌కతాకు ఎలాగూ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం అసాధ్యం. చెపాక్‌ వేదికపై చెన్నైను కేకేఆర్‌ అడ్డుకోగలదో లేదో..?

హ్యాట్రిక్‌ విజయమేనా..?

ముంబయి, దిల్లీ జట్లను వరుసగా ఓడించి ఊపు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌ హ్యాట్రిక్‌ విజయంతోపాటు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌ -2లో ఉన్నప్పటికీ లీగ్‌ దశ ముగిసేనాటికి కూడా అక్కడ ఉండాలంటే ఈ మ్యాచ్‌తోపాటు మిగిలిన చివరి పోరులోనూ (దిల్లీతో) గెలవాల్సి ఉంది. తుషార్‌ దేశ్‌ పాండే, మహీశ్‌ తీక్షణ, మతీషా పతిరణ, దీపక్ చాహర్‌, రవీంద్ర జడేజాతో కూడిన బౌలింగ్ విభాగం కీలక సమయాల్లో జట్టును విజయబాట పట్టించారు. బ్యాటింగ్‌లో శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా నుంచి ఇంకాస్త మెరుగైన ప్రదర్శన అవసరం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వస్తున్న అంబటి రాయుడు ఫామ్‌లో లేకపోవడం సీఎస్‌కేకు లోటుగా ఉంది. ఆఖర్లో ఎంఎస్ ధోనీ దూకుడైన బ్యాటింగ్‌ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. 

వీరితో జాగ్రత్త..

ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలంటే.. కోల్‌కతా హార్డ్‌ హిట్టర్లను అడ్డుకోవాలి. జేసన్ రాయ్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్‌ రాణా, ఆండ్రూ రసెల్, రింకు సింగ్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్‌ బలంగా ఉంది. వీరిలో ఏ ఇద్దరు క్రీజ్‌లో నిల్చున్నా కోల్‌కతా భారీ స్కోరు సాధించగలదు. అయితే, ఆరంభంలో అదరగొట్టిన కోల్‌కతా బౌలింగ్‌ విభాగం బలహీనంగా మారింది. వరుణ్‌ చక్రవర్తి, సుయాశ్ శర్మ, సునీల్‌ నరైన్‌ ‘సింగిల్’ మ్యాచ్‌ స్టార్లుగానే మారారు. ప్లేఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. పాయింట్ల పట్టికలో కోల్‌కతా తన స్థానం దిగజారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 

జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానె, శివమ్‌ దూబె, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే,  మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ

కోల్‌కతా: జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్‌ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), ఆండ్రూ రసెల్, రింకు సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని