Chennai X Kolkata: కోల్‌కతా వరుస విజయాలకు బ్రేక్‌.. తొలిసారి ఓటమి రుచిచూపించిన చెన్నై

వరుస విజయాలతో దూసుకెళుతున్న కోల్‌కతాకు చెన్నై జట్టు షాక్‌ ఇచ్చింది. 7 వికెట్ల తేడాతో ఆ జట్టును చెన్నై చిత్తుగా ఓడించింది.  

Updated : 08 Apr 2024 23:29 IST

చెన్నై: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా (Kolkata)వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. ఆ జట్టుకు చెన్నై తొలిసారి ఓటమి రుచిచూపించింది. నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళుదామనుకున్న కోల్‌కతాను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత ఆ జట్టును 137 పరుగులకే కట్టడి చేసిన చెన్నై.. అనంతరం బ్యాటింగ్‌లో 2.2 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (67*) అర్ధశతకం చేసి ఫామ్‌లోకి వచ్చాడు. డారిల్‌ మిచెల్‌ (25), శివమ్‌ దూబె(28) కీలక పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించకలేకపోయారు.

జడేజా రాకతో మారిపోయిన సీన్‌ 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. చెన్నై బౌలర్ల బీభత్సంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (34: 32 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌. సునీల్‌ నరైన్‌ (27), రఘువంశీ (24) మినహా మిగతావారు దారుణ ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, జడేజా తలో 3 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్‌ 2, తీక్షణ ఒక వికెట్‌ తీశారు. నరైన్‌, రఘువంశీ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా ఆరు ఓవర్లకు 56/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. జడేజా బంతి అందుకోవడంతో కోల్‌కతాకు కష్టాలు మొదలయ్యాయి. జడ్డూ తన స్పెల్‌లో తొలి బంతికే రఘువంశీని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అదే ఓవర్‌లో నరైన్‌నూ ఔట్ చేశాడు. జడ్డూ తన తర్వాతి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ (3)ని పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఏ దశలోనే కోల్‌కతా కోలుకోలేకపోయింది. 34 బంతుల తర్వాత బౌండరీ నమోదైంది అంటే చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 12 ఓవర్‌లో రమణ్‌దీప్‌ సింగ్ (13)ను తీక్షణ వెనక్కి పంపాడు. చెన్నై బౌలర్ల ధాటికి రింకు సింగ్ (9), రస్సెల్ (10) కూడా ధాటిగా ఆడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఓపికగా ఆడి ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ (ముస్తాఫిజుర్‌)లో వెనుదిరిగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని