WI vs IND: విన్నింగ్‌ షాట్‌గా సిక్స్‌.. అయినా హార్దిక్‌పై ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌.. ఎందుకంటే?

ప్రస్తుత భారత ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ గతంలో వ్యవహరించిన మాదిరిగానే హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కూడా ప్రవర్తించాడని అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏ విషయంలో అనేగా మీ సందేహం..?

Updated : 09 Aug 2023 10:13 IST

ఇంటర్నెట్ డెస్క్: కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మరోసారి ట్రోలింగ్‌కు గురికాక తప్పలేదు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) అదరగొట్టేసింది. సూర్యకుమార్‌ యాదవ్ (83) దూకుడుతోపాటు తిలక్ వర్మ (49*) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్‌ విజయం నల్లేరుమీద నడకలా సాగింది. ఇక కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (20*) సిక్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.5 ఓవర్లలోనే ఛేదించి గెలిచింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కదా.. ఇంకేంటి సమస్య అంటారా..? అయితే ఇది చదివేయండి..

ఓడినా.. గెలిచినా దీర్ఘకాలిక ప్రణాళికల్లో మార్పులుండవు: పాండ్య

అభిమానుల ఆగ్రహానికి హార్దిక్‌ పాండ్య గురికావడానికి ప్రధాన కారణం సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించడం. భారత్‌ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు చేయాల్సిన సమయంలో పాండ్య సిక్స్‌ కొట్టాడు. దీంతో మరో వైపు ఎండ్‌లో ఉన్న తిలక్‌ వర్మ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒక్క పరుగు చేస్తే అతడి ఖాతాలో హాఫ్ సెంచరీ వచ్చి చేరేది. వరుసగా రెండు అర్ధశతకాలు చేసినట్లు అయ్యేది. కానీ, ఇలా జరగకుండా సిక్స్‌ కొట్టిన హార్దిక్‌ పాండ్యపై విమర్శలతోపాటు నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌కు తెరలేచింది. ఇదేమీ చివరి బంతి కాదు కదా.. నెట్‌రన్‌రేట్‌ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటూ ఫ్యాన్స్‌ చురకలు అంటించారు. ఈ సందర్భంగా రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో ఇరవై ఏళ్ల కిందట చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేశారు.

అప్పుడు ద్రవిడ్‌ కూడా ఇలానే.. 

ప్రస్తుత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ కూడా  2001/02 సీజన్‌లో విమర్శలపాలైన సంగతి తెలిసిందే. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తూ ద్రవిడ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్‌ త్రిశతకం సాధించాడు. అయితే, ఆ మ్యాచ్‌లోనూ భారత్‌ ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించినా ద్రవిడ్‌ నిర్ణయం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు