Sachin Tendulkar: క్రికెట్‌ దేవుడి ‘ఫిఫ్టీ’.. ఈ ఏడాది సచిన్‌కు ఎంతో స్పెషల్‌!

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ (Sachin) తన క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో శతకాలు, అర్ద శతకాలు నమోదు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత క్రికెట్‌ను ఊర్రూతలూగించిన  నేడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు.

Updated : 24 Apr 2023 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin) 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై పదేళ్లకుపైగా సమయం గడిచినా క్రికెట్‌ దేవుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి మాస్టర్‌ బ్లాస్టర్‌కు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. తన కుమారుడు అర్జున్ తెందూల్కర్ తొలిసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లోకి అడుగు పెట్టాడు. తాను ఒకప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించి.. ప్రస్తుతం మెంటార్‌గా ఉన్న ముంబయి ఇండియన్స్‌ జట్టులోనే అర్జున్‌ ఆడటం విశేషం. రెండు రోజుల కిందటే పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సచిన్‌తో ముంబయి క్రికెటర్లు కేక్‌ను కోయించారు. ఇవాళ సచిన్‌కు సోషల్‌ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీస్థాయిలో విషెస్ అందాయి. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికతో సచిన్‌ పలు కీలక విషయాలపై మాట్లాడాడు. 

అస్సలు ఆలోచించట్లేదు..

చాలామంది 50 సంవత్సరాలు వచ్చాయి కదా.. ఎలా ఉంది అని అడుగుతుంటారు. నిజాయతీగా చెప్పాలంటే.. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించను. నా జీవితంలో 24 ఏళ్లు క్రికెట్‌ ఆడేశా. అది నా మొదటి ఇన్నింగ్స్‌. గత పదేళ్ల నుంచి రెండో ఇన్నింగ్స్‌లో ఉన్నా. అందుకే నేను పాతికేళ్ల కుర్రాడిలానే ఫీలవుతా. ఇప్పటికీ నా స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడటం.. వారిని ఆటపట్టించడం చేస్తుంటా. అప్పుడే మనల్ని మనం శారీరకంగా, మానసికంగా యంగ్‌గా ఉంచుకోవచ్చు.

దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వకారణమే

నేను టీమ్‌ఇండియా కోసం పదేళ్ల కిందట చివరిసారిగా ఆడాను. భారత జట్టుకు ఆడటం ఎప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. మైదానంలో సవాళ్లు, సహచరులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ అనుభవాలు.. అన్నీ మధుర జ్ఞాపకాలే. అయితే ఇదేమీ శాశ్వతం కాదని తెలుసు.  క్రికెట్‌కు వీడ్కోలు పలికే చివరి మ్యాచ్‌లోనూ ఎన్నో అనుభవాలు ఆస్వాదించా. అందుకే, ఇప్పటికీ నేనేం మిస్‌ కాలేదనే భావన నాలో ఉంది.

పొట్టి ఫార్మాట్‌తోపాటు టెస్టు క్రికెట్‌ ఉండాలి 

క్రికెట్‌ ఫార్మాట్లను బ్యాలెన్స్‌డ్‌గా సరిచేయాలి. వాణిజ్యపరంగానే కాకుండా క్రికెటింగ్‌ స్కిల్స్‌పైనా దృష్టి పెట్టాలి. ఇప్పటి యువత టీ20 ఫార్మాట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. అలాగే టెస్టు క్రికెట్‌ కూడా వేగంగా ముందుకు సాగిపోవాలి.  టెస్టు క్రికెట్‌ కనుమరుగయ్యే రోజు ఎవరూ చూడకూడదు. బౌలర్‌కు పిచ్‌ అనుకూలంగా ఉంటే మ్యాచ్‌లు రసవత్తరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. 

అలా జడ్జ్‌ చేయకూడదు.. 

టెస్టు మ్యాచ్‌ ఫలితాలను ఎప్పుడూ రోజులతో కొలవకూడదు. ఐదు రోజులు జరిగిందా..? రెండున్నర రోజుల్లోనే ముగిసిందా..? అనేది పక్కన పెట్టాలి. నాణ్యమైన క్రికెట్‌ ఆడితే ఆ మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగిసినా ఫర్వాలేదు. ఎందుకంటే ఛాలెంజింగ్ వికెట్ ఉండటం వల్ల ఇరు జట్లూ విజయం కోసం పోరాడతాయి. అప్పుడే ఆటగాళ్లలోని స్కిల్స్‌ బయటపడతాయి.

నాకైతే తెలియదు.. 

మా కాలంలో టీ20 ఫార్మాట్ ఉండుంటే నా బ్యాటింగ్ శైలిలో మార్పులు వచ్చేవో లేదో నాకైతే తెలియదు. మేం ఆడిన సమయంలో చాలా మందికి టీ20 ఫార్మాట్‌ గురించి అర్థం కాలేదు. అయితే, ఇప్పుడు నా దృష్టిలో పొట్టి ఫార్మాట్‌ చాలా సులభం. వన్డేల్లో, టెస్టుల్లో రోజుల తరబడి శారీరకంగా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు టీ20లు కేవలం మూడున్నర గంటల్లోనే ముగుస్తున్నాయి. బౌలర్లు కూడా పెద్ద స్పెల్స్ వేయాల్సిన అవసరం లేదు. 

2007 వరల్డ్ కప్‌...

నా క్రీడా జీవితంలో ఏవైనా మార్పులు రావాలని కోరుకోవాలనుకుంటే.. 2005 నుంచి 2007 మధ్య భారత క్రికెట్‌ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలని కోరుకుంటా. ఆ రెండేళ్లు భారత్‌ క్రికెట్‌కు కష్టకాలం. అలాగే 90వ దశకంలోని చివరి రోజుల్లోనూ టీమ్‌ఇండియా నుంచి సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాం. ఈ రెండు సందర్భాల్లో మార్పు రావాలని భావిస్తున్నా. 

మార్పు మొదలైంది..

భారత క్రికెట్‌లో ఇప్పటికే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు, మహిళా ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం.. ఇలా మార్పు మొదలైంది. ఇలా చేయడం వల్ల బాలికలు క్రీడారంగంలోకి వచ్చేందుకు తలుపులు తెరిచినట్లు అయింది. నేను ‘సచిన్‌ తెందూల్కర్‌ ఫౌండేషన్ ’ ద్వారా చిన్నారుల ఆరోగ్యం, విద్య, క్రీడా రంగాలపై కృషి చేస్తున్నాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని