
ఆనందంగా.. సురక్షితంగా.. ఆశావహంగా 2021
క్రీడాకారుల కొత్త ఏడాది శుభాకాంక్షలు ఇవే..!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు ప్రశాంతంగా సాగాయి. పరివర్తన చెందిన కరోనా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో ఎలాంటి హంగు ఆర్భాటాలకు ప్రజలు తావివ్వడం లేదు. టీమ్‌ఇండియా క్రికెటర్లు సైతం అత్యంత సాధారణంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకొన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. 2020 తరహాలో కాకుండా ఏడాది సాంతం క్రీడలు జరగాలని కోరుకున్నారు. సచిన్ తెందూల్కర్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. క్రికెటర్లే కాకుండా బ్యాడ్మింటన్ తారలు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ సైతం అభిమానులకు శుభకామనలు అందజేశారు.
‘సరికొత్త ఆరంభం నేపథ్యంలో 2021 సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. గతేడాది నేర్చుకున్న వెలకట్టలేని పాఠాలను అలాగే కొనసాగించండి. ఎన్నెన్నో విలువైన వస్తువలనిచ్చే ప్రకృతి మాతను ఇబ్బంది పెట్టకండి. బంధాలకు విలువనిస్తూ ఆత్మీయులకు అందుబాటులో ఉండండి’ అని సచిన్ ట్వీట్ చేశారు. ‘కొత్త సంవత్సరం, కొత్త అనుభూతులు, కొత్త అవకాశాలు, అవే కలలు, సరికొత్త ఆరంభాలు.. 2021’ అంటూ కేఎల్ రాహుల్ పోస్ట్ చేశాడు. ‘2020, మనం కోరుకున్నట్టుగా లేదు. అయితే మనకు లభించినవాటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనం ఎదుర్కొంటున్న సవాళ్లన్నీ అధిగమిస్తామని విశ్వసిస్తున్నా. ఇంట్లోనే సురక్షితంగా కుటుంబ సభ్యులతో గడిపినందుకు ఆనందిస్తున్నా. ఇప్పుడు నేర్చుకున్న పాఠాలతో 2021లో బాగుండాలని కోరుకుంటున్నా’ అని అజింక్య రహానె అన్నాడు. ‘2020 నిజంగానే కఠినంగా సాగింది. కానీ మనం నవ్వేందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు’ అని కిదాంబి శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. ఇంకా ఎవరెవరు అభినందనలు తెలిపారంటే..
ఇవీ చదవండి
కోహ్లీసేన.. 2021లో మారాలిక!
మానసిక ఇబ్బందుల్లో స్మిత్..!