MI-CSK: అవన్నీ రూమర్స్‌ అన్న సీఎస్కే సీఈవో.. ‘వచ్చే తరానికి రోహిత్ మార్గనిర్దేశం’

రోహిత్‌ శర్మను ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కెప్టెన్‌గా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని ట్రేడ్ చేసుకోవడానికి ఒకట్రెండు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపాయని ప్రచారం జరిగింది.

Updated : 20 Dec 2023 17:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను తొలగించి అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను నియమించిన సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని రోహిత్‌ అభిమానులు తప్పుపడుతున్నారు. హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలుస్తూ అదే సమయంలో ముంబయి మేనేజ్‌మెంట్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ మరో జట్టులో చేరతాడనే ప్రచారం జరిగింది. అతడు ట్రేడింగ్‌ కోసం అందుబాటులో ఉన్నాడా? అని ఒకట్రెండు ఫ్రాంఛైజీలు ఆరా తీశాయని వార్తలొచ్చాయి. రోహిత్‌ శర్మతోపాటు ముంబయిలోని టాప్‌ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రాల ట్రేడింగ్‌ కోసం ఓ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపిందట. ముంబయి ఆటగాళ్లపై కన్నేసిన ఫ్రాంఛైజీల్లో సీఎస్కే (CSK) కూడా ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, తమ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్‌తో ట్రేడింగ్‌కు దూరంగా ఉంటుందని సీఎస్కే సీఈవో కాశీవిశ్వనాథన్‌ స్పష్టం చేశాడు. ‘‘మా ఫ్రాంఛైజీ నియమ నిబంధనల ప్రకారం మేము ఆటగాళ్లను ట్రేడ్ చేయం. ముంబయి ఇండియన్స్‌తో ట్రేడింగ్ చేయడానికి మా వద్ద ఆటగాళ్లు కూడా లేరు. మేం వారిని సంప్రదించలేదు. ఆ ఉద్దేశం కూడా లేదు’’ అని పేర్కొన్నారు. 


రోహిత్ వచ్చే తరానికి మార్గనిర్దేశం చేస్తాడు: జయవర్ధనె 

రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై ముంబయి ఇండియన్స్‌ పర్ఫార్మెన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ మహేల జయవర్ధనె (Mahela Jayawardene) మరోసారి స్పందించాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని, వారసత్వ నిర్మాణంలో భాగంగా ఈ మార్పునకు ఉపక్రమించామని తెలిపాడు.  ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. నిజాయితీగా చెప్పాలంటే ఎమోషనల్‌ మూమెంట్. అభిమానులు అలా స్పందించడంలో కూడా న్యాయం ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనై ఉంటారని భావిస్తున్నాను. మనం కూడా దానిని గౌరవించాలి. కానీ, ఒక ఫ్రాంఛైజీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వారసత్వ నిర్మాణంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వచ్చే తరానికి మార్గనిర్దేశం చేయడానికి జట్టులో రోహిత్ శర్మ మైదానం లోపల, వెలుపల ఉండటం మాకు చాలా ముఖ్యం. అతను ఎంతో ప్రతిభావంతుడు. జట్టును నడిపించే వారసత్వంలో భాగమవుతాడు. యువ ఆటగాళ్లతో ఆడిన సచిన్‌.. జట్టు సరైన దిశలో వెళుతుందని నిర్ధారించుకుని వేరొకరికి కెప్టెన్సీ అప్పగించాడు. ఇది కూడా అలాంటిదే’’ అని జయవర్ధనె పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని