David Warner: నూతన సంవత్సరంలో డేవిడ్‌ వార్నర్‌కు కొత్త బాధ్యతలు

వన్డే కెరీర్‌కు ముగింపు పలికిన డేవిడ్‌ వార్నర్‌ (David Warner) లీగ్‌ల్లో ఆడేందుకు అధిక సమయం కేటాయిస్తానని ఇప్పటికే ప్రకటించాడు. దీంతో మరో లీగ్‌లో అతడికి సరికొత్త బాధ్యతలు దక్కాయి.

Updated : 01 Jan 2024 14:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే కెరీర్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ (David Warner) మరో వారం రోజుల్లో అంతర్జాతీయ టెస్టులకూ గుడ్‌బై చెప్పేయనున్నాడు. పాకిస్థాన్‌తో జరగనున్న మూడో టెస్టు అతడికి ‘వీడ్కోలు మ్యాచ్‌’ కానుంది. ఈ క్రమంలో అతడికి కొత్త బాధ్యతలు వచ్చాయి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20) ఫ్రాంచైజీ దుబాయ్‌ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను నియమించుకొన్నట్లు ప్రకటించింది. ఐపీఎల్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్‌గా చేసిన విషయం తెలిసిందే. 

ఆ ప్రశ్న వస్తుందని తెలుసు: వార్నర్

డేవిడ్ వార్నర్‌ అనగానే ‘బాల్‌ టాంపరింగ్‌’ అంశం చర్చకు వస్తుంది. అతడి రిటైర్‌మెంట్ ప్రకటన చేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడిన సందర్భంగానూ ఇదే అంశంపై పలు ప్రశ్నలు వచ్చాయి. దానికి వార్నర్ సమాధానం ఇస్తూ.. ‘‘ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు. కానీ, నా కెరీర్‌ పట్ల నాకెలాంటి చింత లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు శ్రమించా. ఆటపట్ల నాకున్న అభిరుచి, నేను మెలిగిన విధానమే మళ్లీ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషించా. ఆసీస్‌ తరఫున ప్రతి చిన్నారి ఆడేలా స్ఫూర్తిగా నిలిచానని భావిస్తున్నా’’ అని వార్నర్‌ వ్యాఖ్యానించాడు.

చివరి టెస్టులో సెంచరీ కొట్టడం చూడాలి: సిడ్నీ మైదానం క్యురేటర్

సిడ్నీ క్రికెట్ మైదానంలో (SCG) డేవిడ్‌ వార్నర్‌ చివరి టెస్టు మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ సందర్భంగా ఎస్‌సీజీ క్యురేటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘డేవిడ్‌ వార్నర్‌ చాలాకాలంపాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టు కోసం చాలా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడిపట్ల మాకున్న గౌరవం అపారం. మా టీమ్‌ అంతా అతడి చివరి టెస్టులో సెంచరీ కోసం ఎదురు చూస్తోందని నాకు తెలుసు’’ అని ఆడమ్‌ లూయిస్‌ తెలిపాడు. తొలి టెస్టులో అద్భుతమైన శతకంతో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని