NZ vs AFG: ఆ 5 క్యాచ్‌లు మిస్‌ కావడం బాధించాయి.. ఓటమికి ఆ నిర్ణయం కూడా ఒక కారణం: అఫ్గాన్‌ కెప్టెన్‌

ఇంగ్లాండ్‌పై గెలిచి అదే జోరును కొనసాగిస్తుందనుకున్న అఫ్గానిస్థాన్‌ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చతికిలపడింది. 149 పరుగుల తేడాతో కివీస్‌ చేతిలో ఓడిపోయింది. కీలకమైన క్యాచ్‌లను జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకుంది. 

Updated : 19 Oct 2023 09:44 IST

చెన్నై: వన్డే ప్రపంచకప్‌(Cricket World Cup 2023)లో భాగంగా మొన్న జరిగిన మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ విజేత ఇంగ్లాండ్‌(England)ను ఓడించి ఔరా అనిపించిన అఫ్గానిస్థాన్‌(Afghanistan)పై భారీగా అంచనాలు పెరిగాయి. కానీ, తాజాగా న్యూజిలాండ్‌(NZ vs AFG)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన కివీస్‌.. నిర్ణీత 50 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేయగా.. చేధనకు దిగిన అఫ్గాన్‌ 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌ 149 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. తమ ఆటగాళ్లు ఐదు క్యాచ్‌లను వదిలేయడం బాధ కలిగించిందని అఫ్గాన్‌ కెప్టెన్ హష్మతుల్లా షాహిది వ్యాఖ్యానించాడు. వాటి వల్లే న్యూజిలాండ్‌ విజయం సాధించిందని తెలిపాడు. 

మ్యాచ్‌ అనంతరం షాహిదీ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌లో ఇలా క్యాచ్‌లు మిస్‌ చేయడం వల్ల మేమెంతో నిరుత్సాహానికి గురయ్యాం. మ్యాచ్‌ గెలిచేందుకు మేం ప్రయత్నించాం కానీ.. ఫీల్డింగ్‌ లోపాల వల్ల వెనుకబడ్డాం. చివరి ఆరు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఎక్కువ పరుగులు చేసింది. అంతకుముందు కొన్ని క్యాచ్‌లు మిస్‌ చేశాం. లేథమ్‌, ఫిలిప్స్‌ను నిలువరించలేకపోయాం. దీంతో మ్యాచ్‌ న్యూజిలాండ్‌ వైపు తిరిగింది. టాస్‌ గెలిచి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకోవడం కూడా ఓటమికి కారణమనే చెప్పాలి. పిచ్‌ను మేం అర్థం చేసుకోలేకపోయాం. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. మేం బౌలింగ్‌ బాగానే చేశాం. కానీ ఫీల్డింగ్‌లోనే లోపాలున్నాయి. ఇంగ్లాండ్‌పై గెలిచిన తర్వాత ఆ ఫామ్‌ను నిలుపుకోలేపోయాం. ఈ మ్యాచ్‌ మాకు చేదు అనుభవాన్ని మిగిలించవచ్చు. కానీ, ఇప్పుడే ఏం అయిపోలేదు. ఇంకా చాలా మ్యాచ్‌లున్నాయి. తర్వాత మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఉంది. మా జట్టులోని లోపాల్ని సరిచేసుకొని తిరిగి బలంగా పోటీ పడతాం’’అని షాహిది చెప్పుకొచ్చాడు. 

అఫ్గానిస్థాన్‌ ఆలౌట్‌.. న్యూజిలాండ్ ఘన విజయం

అఫ్గాన్‌ జారవిడిచిన క్యాచ్‌లు మాకెంతో ఉపయోగపడ్డాయని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ అన్నాడు. ‘‘టోర్నీ మొదటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ సరైన దారిలోనే వెళ్తున్నామనిపిస్తోంది. మేం తర్వాత ఇండియా, ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఆయా మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలనుకుంటున్నాం. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్‌ బ్యాటింగ్‌ పట్ల ఎంతో సంతృప్తిగా ఉంది. వెనువెంటనే మూడు వికెట్ల పడటంతో మేమిద్దరం భాగస్వామ్యాన్ని నిర్మించాలనుకున్నాం. మొదట మా ఇద్దరిపై ఒత్తిడి ఉండేది. ఆ తర్వాత ఒత్తిడిని ప్రత్యర్థి జట్టుపై పెట్టాం. ఫలితంగా విజయం మాకే దక్కింది. వాళ్లు కొన్ని క్యాచ్‌లు జారవిడిచారు. వాటిని మేం సద్వినియోగం చేసుకున్నాం. మా టీమ్‌ సభ్యులంతా బాగా ఆడారు. ఈ మ్యాచ్‌ ద్వారా చివరి 10 ఓవర్లలో ఎలా ఆడాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాం’’అని లాథమ్‌ తెలిపాడు. 

ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు మిస్‌ అవడం ఒత్తిడి వల్ల కాదని.. తాను బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని అఫ్గాన్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ వెల్లడించాడు. ‘‘గణాంకాలు చూస్తే.. మేం క్యాచ్‌లు వదిలేయడం వల్ల వెనుకబడి ఉన్నాం. అందులో మేం మరింత మెరుగుపడాల్సి ఉంది. మా బౌలర్లు చక్కగా బౌలింగ్‌ వేసి న్యూజిలాండ్‌ను సాధారణ స్కోర్‌కే కట్టడి చేశారు. అయితే,  ప్రత్యర్థులు లేథమ్‌, ఫిలిప్స్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు’’అని జొనాథన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని