World Cup - NZ vs AFG: అఫ్గానిస్థాన్‌ ఆలౌట్‌.. న్యూజిలాండ్ ఘన విజయం

ప్రపంచకప్‌లో మొన్న డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను కంగుతినిపించిన అఫ్గాన్‌స్థాన్‌.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. అఫ్గాన్‌ ముఖ్యంగా బ్యాటింగ్‌లో విఫలమైన ఘోర ఓటమిపాలైంది.

Updated : 18 Oct 2023 21:37 IST

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో మొన్న డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను కంగుతినిపించిన అఫ్గాన్‌స్థాన్‌.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది. అఫ్గాన్‌ ముఖ్యంగా బ్యాటింగ్‌లో విఫలమైన ఘోర ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌.. కివీస్‌ బౌలర్ల ధాటికి 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. అఫ్గానిస్థాన్‌ జట్టులో రహమత్‌ షా (36; 62 బంతుల్లో) టాప్‌ స్కోరర్. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (27) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రహ్మనుల్లా గుర్భాజ్‌ (11), ఇబ్రహీం జాద్రాన్ (14), హష్మతుల్లా షాహిది (8) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఆల్‌రౌండర్లు మహ్మద్‌ నబీ (7), రషీద్‌ఖాన్‌ (8) కూడా పోరాడలేకపోయారు. ఇక్రమ్ (19*) నాటౌట్‌గా నిలిచాడు.

14 పరుగులు.. ఐదు వికెట్లు

అఫ్గాన్‌ 14 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. 30.3 ఓవర్లకు 125/5తో ఆ జట్టు.. మరో 25 బంతుల్లోనే మిగతా ఐదు వికెట్లను చేజార్చుకుంది. నబీని శాంట్నర్‌ క్లీన్‌బౌల్డ్ చేయగా.. రషీద్‌ఖాన్‌, ముజిబుర్‌ రెహ్మన్‌ (4)ను ఫెర్గూసన్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. నవీనుల్ హక్ (0), ఫారూఖీ (0)లను శాంట్నర్ వెనక్కి పంపాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, మిచెల్ శాంట్నర్‌ 3, ట్రెంట్ బౌల్ట్ 2, మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆదుకున్న లాథమ్‌, ఫిలిప్స్

న్యూజిలాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్ (54; 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ టామ్ లాథమ్ (68; 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్‌ (71; 80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. డేవాన్ కాన్వే (20), రచిన్‌ రవీంద్ర (32) భారీ స్కోర్లు చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఒక దశలో 110 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను లాథమ్‌, గ్లెన్ ఫిలిప్స్‌ ఆదుకున్నారు. చివర్లో మార్క్‌ చాప్‌మన్‌ (25*; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అఫ్గాన్‌ బౌలర్లలో ఒమర్‌జాయ్‌ 2, నవీనుల్ హక్ 2, ముజిబుర్‌ రెహ్మన్, రషీద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.  దీంతో కివీస్ మంచి స్కోరు సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని