Ind vs Eng: టీమ్‌ఇండియా కెప్టెన్‌గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్‌

భారత్‌తో ఎడ్జ్‌బాస్టన్‌  వేదికగా శుక్రవారంప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం ఇంగ్లాండ్ తుది జట్టుని ప్రకటిస్తే టీమ్‌ఇండియా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌లను ఖరారు చేసింది . భారత జట్టుకు జస్ప్రిత్‌ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.

Updated : 30 Jun 2022 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం టీమ్‌ ఇండియా కెప్టెన్‌ ఎవరనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వైస్‌ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన జస్ప్రిత్‌ బుమ్రాను కెప్టెన్‌గా నియమించింది. రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. రోహిత్‌ శర్మ కరోనా బారినపడి, పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో బుమ్రాను కెప్టెన్‌గా ఖరారు చేశారు. భారత తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

మరోవైపు ఇంగ్లాండ్‌ ఫైనల్‌ 11ను ప్రకటించింది. న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో ఆడని సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ స్థానంలో ఎంపికైన శామ్ బిల్లింగ్స్‌‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌ సిరీస్‌లో విఫలమైన ఓపెనర్‌ జాక్ క్రాలీకి మరో అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో ఫర్వాలేదనిపించిన మరో ఓపెనర్‌ అలెక్స్ లీస్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, కెప్టెన్‌ స్టోక్స్‌లతో మిడిలార్డర్‌ దుర్భేద్యంగా ఉంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ లీచ్‌, సీనియర్‌ పేసర్‌ బ్రాడ్‌, యువ సంచలనం మాథ్యూ పోట్స్‌లతో బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది. న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో 97 పరుగులతో పాటు 2 వికెట్టు పడగొట్టిన ఓవర్టన్‌ అండర్సన్‌ రాకతో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

ఇంగ్లాండ్ తుది జట్టు : అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

గతేడాది నాలుగు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్‌ జట్టుకు ఇప్పటికి టీమ్‌కు పోలికే లేదు. కెప్టెన్‌తో సహా ఏడుగురు మారారు. అప్పుడు ఆడిన జో రూట్‌, ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో, జేమ్స్‌ అండర్సన్‌ మాత్రమే ఐదో టెస్టులో ఆడటం గమనార్హం. సిరీస్‌లో భారత్‌ మొదటి మ్యాచ్‌ డ్రా చేసుకున్న భారత్‌ రెండింట్లో గెలిచింది. కరోనా కారణంతో చివరి టెస్టు వాయిదా పడిన నాటికి భారత్‌  2-1 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.

గురువారమూ పాజిటివ్‌: కరోనా బారిన పడిన రోహిత్‌ శర్మ ఇంకా కోలుకోలేదు. ఈ రోజు ఉదయం చేసిన రాపిడ్‌ టెస్ట్‌లోనూ పాజిటివ్‌ వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతను మరికొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. వరుసగా రెండు ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వస్తేనే రోహిత్‌ను ఆటకు అనుమతిస్తామని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని