IPL 2023: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌.. 15 పాయింట్లు చాలు.. 16 పాయింట్లు ఉన్నా కష్టమే: ఆకాశ్ చోప్రా

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు కావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, క్రికెట్‌ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా మాత్రం విభిన్నంగా స్పందించాడు.

Published : 18 May 2023 21:09 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు మినహా అన్ని జట్లూ పదమూడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. నేడు ఆ రెండు టీమ్‌ల మధ్య ఉప్పల్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ (18 పాయింట్లు) ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోగా.. చెన్నై (15 పాయింట్లు), లఖ్‌నవూ (15 పాయింట్లు), ముంబయి (14 పాయింట్లు)  ఇప్పటి వరకు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇవన్నీ తమ చివరి మ్యాచ్‌లను గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరిపోతాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే 15 పాయింట్లు ఉన్నా సరిపోతుందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. 16 పాయింట్లు రాని పక్షంలో 15 పాయింట్లు, 14 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు అవుతాయని పేర్కొన్నాడు. 

‘‘ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయి. 16 పాయింట్లు ఉన్నా చేరకపోవచ్చు. ఇదొక అద్భుతమైన సీజన్‌ కాబోతోంది. ఇప్పుడు చెన్నై, లఖ్‌నవూ తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే 17కి చేరతాయి. అప్పుడు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ముంబయి, బెంగళూరు 16 పాయింట్లతో ఉంటే నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇలా ఒక జట్టు 16 పాయింట్లతో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లదు. అలా కాకుండా సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ 15 పాయింట్లతో లీగ్‌ స్టేజ్‌ను ముగించినా క్వాలిఫై అవుతాయి. అప్పుడు బెంగళూరు, ముంబయి 16 పాయింట్లకు చేరకూడదు. అంటే ముంబయి తన చివరి మ్యాచ్‌లో ఓడితే 14పాయింట్ల వద్దే ఉంటుంది. ఇక బెంగళూరు మిగిలిన రెండింట్లోనూ ఓడితే 12 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. అప్పుడు 15 పాయింట్లు, 14 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. సూపర్‌ సీజన్‌’’ అంటూ ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన చివరి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. కోల్‌కతాతో లఖ్‌నవూ, హైదరాబాద్‌తో ముంబయి ఆడాల్సి ఉంది. ఇక బెంగళూరుకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుండగా.. మే 21న గుజరాత్‌ను ఢీకొట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని