Shreyas Iyer: శ్రేయస్ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే.. అదొక్కటే మార్గం: భారత మాజీ క్రికెటర్లు

ఇంగ్లాండ్‌పై శతకంతో గిల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, సీనియర్‌ బ్యాటర్ శ్రేయస్‌ మాత్రం వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Updated : 08 Feb 2024 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) విఫలమయ్యాడు. వచ్చిన శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు మిగిలిన నేపథ్యంలో.. వాటికి అయ్యర్‌ను ఎంపిక చేయడంపై సందిగ్ధత నెలకొంది. యువకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. వరుసగా విఫలమవుతున్న సీనియర్‌ను పక్కన పెట్టాలనే డిమాండ్లూ వస్తున్నాయి. సర్ఫరాజ్‌ ఖాన్‌ను జట్టులో కొనసాగించి.. శ్రేయస్‌ను దేశవాళీలో ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు.

‘‘ఇప్పుడు జట్టులో ఉన్న వారిలో శ్రేయస్‌ అయ్యర్‌ కాస్త వెనుకబడ్డాడు. గాయం నుంచి కోలుకొన్నాక మైదానంలో సత్తా చూపాలి. గతంలో స్టార్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం తర్వాత అదరగొట్టేశారు. నేరుగా తుది జట్టులోకి వచ్చి ఆడారు. ఇప్పుడు శ్రేయస్‌ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. రజత్‌ పటీదార్‌ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ విరాట్, కేఎల్ రాహుల్ మిగతా టెస్టుల కోసం జట్టులోకి వస్తే మాత్రం వీరి స్థానాలకు ఇబ్బందే. అయ్యర్‌ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే వెంటనే దేశవాళీ క్రికెట్‌ ఆడాలి. భారీగా పరుగులు చేయాలి’’ అని ఓజా వ్యాఖ్యానించాడు. 

మంచి అవకాశాలను వృథా చేసుకొన్నావు: జహీర్‌

‘‘స్పిన్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఆడే శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో లభించిన అవకాశాలను వృథా చేసుకున్నాడు. పర్యటక జట్టు కేవలం ఒకే ఒక్క పేసర్‌తో తొలి రెండు టెస్టులను ఆడింది. రెండో టెస్ట్‌లో అండర్సన్‌ బౌలింగ్‌ను అడ్డుకొని ఉంటే సరిపోయేది. కానీ, ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలనే అతివిశ్వాసంతో శ్రేయస్‌ ఔటయ్యాడు. దీంతో తర్వాత మ్యాచుల్లో అవకాశాలు దక్కుతాయో..? లేదో? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి’’ అని భారత మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని